ఎనిమిది సింహాలు జనాల మధ్యకొచ్చి గర్జిస్తే..
అహ్మదాబాద్: జూలో ఉన్న సింహాలు గర్జిస్తేనే ఒళ్లంతా వణికిపోతుంది. అలాంటిది ఏకంగా రోడ్లపైకి, జనాల మధ్యలోకి వచ్చి గర్జిస్తే పరిస్థితి ఏమిటి? అది కూడా ఏకంగా ఎనిమిది సింహాలు ఆ పనిచేస్తే ఇంకేమైనా ఉంటుందా.. గుజరాత్లో ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీధి కుక్కల మాదిరిగా ఇప్పుడు సింహాలు గిర్ సోమనాథ్ జిల్లాలోని జునాఘడ్ పట్టణం సమీపంలో హల్ చల్ చేస్తున్నాయి. కనిపించినవారిపై వరుసదాడులు చేస్తున్నాయి.
రెండు సింహపు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది సింహాలు జునాఘడ్ పట్టణంలోని నివాస ప్రాంతంలో రాత్రిపూట సంచరిస్తుండగా ఓ వ్యక్తి వాటిని సెల్ ఫోన్ తో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఇప్పుడు అక్కడి చుట్టుపక్కల వారు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. అమ్రేలీ జిల్లాలో మంగళవారం రాత్రి అడ్సాంగ్ అనే ప్రాంతంలో గొర్రెల కాపరిపై ఓ మూడు సింహాలు దాడి చేయడంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అలాగే, ఇదే ఏడాది మార్చి, మే నెలలో జరిగిన సింహాల దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గిర్ వన్యమృగ క్షేత్రం నుంచి ఈ సింహాలు తప్పించుకొని వచ్చినట్లు సమాచారం.