
సాక్షి,గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఇప్పటివరకూ తేదీలను ప్రకటించకపోయినా ప్రధాని మోదీ స్వరాష్ర్టంలో పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు సోషల్ మీడియా వేదికలపై పరస్పరం దుమ్మెత్తిపోస్తున్నాయి.గుజరాత్‌లో బీజేపీ అభివృద్ధి నమూనాను ఎండగడుతూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిపితే తాజాగా కాంగ్రెస్ వరుస పరాజయాలను హైలైట్ చేస్తూ బీజేపీ చేపట్టిన క్యాంపెయిన్‌కు భారీ స్పందన లభిస్తోంది.
2011 వరల్డ్ కప్‌లో భారత్, పాక్‌లు తలపడిన సందర్భంలో పాపులర్ అయిన మోకా..మోకా వీడియోను కాంగ్రెస్ పరాజయాలపై బీజేపీ వాడుకుంటోంది. సోషల్ మీడియాలో ఉంచిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం ఇన్‌ఛార్జ్ ఛుతవలే ఈ వీడియోను పోస్ట్ చేశారు. రాహుల్ గాంథీ సహా పార్టీ అగ్ర నాయకత్వం వరుస పరాజయాలతో సతమతమవుతున్న తీరును ఈ వీడియోలో ప్రస్తావించారు.