జుకర్ అడుగుపెట్టిన ఊర్లో ఈ బ్యాంకింగ్ కష్టాలు
జైపూర్: అది ఒక సైబర్ విలేజ్.. 2014లో మైనారిటీ సైబర్ గ్రామ యోజన పథకం అమలు చేసేందుకు తొలిసారి ఈ గ్రామాన్నే ఎంపిక చేశారు. దీన్ని ఫేస్‌బుక్ అధినేత సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ కూడా సందర్శించారు. ఇన్ని ప్రతిష్టలు ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం ఈ బ్యాంకిగ్ పనిచేయని పరిస్థితి నెలకొంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రాధాన్యం పెరుగుతున్న ప్రస్తుత సమయంలో సైబర్ గ్రామంగా పేరొందిన ఇక్కడ అలాంటి పరిస్థితే లేకుండాపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో చందోలి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసుగలవారికి మైనారిటీ సైబర్ గ్రామ్ యోజన పథకం ద్వారా కంప్యూటర్ విద్యను నేర్పించాలనేది లక్ష్యంగా నిర్ణయించారు. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి సర్వం నేర్పించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే, ఈ పథకం అమలును ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆపేసింది. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా అక్కడ కంప్యూటర్ సెంటర్ ను నడిపిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ బ్యాంకింగ్ విధానంలో మాత్రం అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోతుంది. ‘పెద్ద నోట్ల రద్దు మా గ్రామాన్ని దారుణంగా దెబ్బకొట్టింది. మా గ్రామంలోని ఆర్థిక కార్యకలాపాలు స్తంబించిపోయాయి. ఇప్పటికీ బ్యాంకుల ముందు కనుచూపుమేరలో క్యూ కనిపిస్తోంది. ఈ కంప్యూటర్ సెంటర్ ద్వారా ఈ బ్యాంకింగ్‌పై అవగాహన, డబ్బు బదిలీ సేవలు చేస్తారని అన్నారు. కానీ చివరకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది’ అని ఆ గ్రామ సర్పంచి ముబారిక్ ఖాన్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగిస్తే తమ గ్రామంతోపాటు పక్క గ్రామాల పరిస్థితులు కూడా మారిపోయి ఉండేవని అన్నారు. గతంలో ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ వచ్చినప్పుడు తమ గ్రామం అందరి దృష్టిని ఆకర్షించిందని అన్నారు.