మోటార్లతో చెరువును తోడేస్తున్న గ్రామస్తులు
బెంగళూరు : అనుమానం ఆ గ్రామస్తుల పాలిట పెనుభూతంలా మారింది. ఎయిడ్స్ కారక హెచ్‌ఐవీ వైరస్ సోకిన మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటంతో.. 36 ఎకరాలలో విస్తరించి ఉన్న చెరువులోని నీటిని తోడిపడేస్తున్నారు. తాగటానికి ప్రధాన వనరుగా ఉన్న ఆ చెరువును ఖాళీ చేసే పనిలో తలమునకలయ్యారు. ఈ సంఘటన కర్ణాటక హుబ్లీ జిల్లా మొరాబ్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. నవంబర్ 29న మొరాబ్ గ్రామంలో ఓ మహిళ హెచ్‌ఐవీతో బాధపడుతూ అక్కడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొద్దిరోజుల తర్వాత మహిళ శవం నీటిపై తేలడంతో గుర్తించిన గ్రామస్తులు దాన్ని బయటకు తీశారు. అప్పటికే ఆ శవాన్ని చేపలు కొద్దిగా పీక్కుతిన్నాయి. దీంతో గ్రామస్తుల్లో భయం మొదలైంది. హెచ్‌ఐవీ సోకిన మహిళ శవంతో చెరువు నీరు కలుషితమై ఉంటుందని, ఆ నీటిని వాడితే హెచ్‌ఐవీ తమకు కూడా వస్తుందన్న అనుమానంతో తాగటానికి ఏకైక మార్గంగా ఉన్న 36 ఎకరాల చెరువులోని నీళ్లను తోడేయ్యాలని నిశ్చయించుకున్నారు.
దాదాపు గత నాలుగు రోజులనుంచి చెరువులోని నీళ్లను తోడేయ్యటానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పదుల సంఖ్యలో మోటార్లు ఉపయోగించి చెరువును తోడేస్తున్నారు. మొరాబ్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. చాలా కాలం కిందట అదే చెరువులో ఒక బాలుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అప్పుడు చెరువును తోడేయ్యాలన్న ఆలోచన గ్రామస్తులకు రాలేదని, ఈ మధ్య చెరువులో దూకిన మహిళకి హెచ్‌ఐవీ ఉండటం వల్ల ఆ నీటిని తాగితే రోగం అందరికి వచ్చే అవకాశం ఉందన్న అనుమానంతో చెరువు నీళ్లను తోడుతున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment