
అందరికీ ఇళ్లు, వాహనాలు
విజన్ 2031–32 రూపొందించిన నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: వచ్చే 15 ఏళ్లలో ప్రజలందరికీ సకల సదుపాయాలు కల్పించి, దేశానికి కొత్త రూపు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. 2032కల్లా అందరికీ అందుబాటులో గృహాలు, ద్విచక్ర వాహనాలు లేదా కార్లు, పవర్, ఎయిర్ కండీషన్లు, డిజిటల్ కనెక్టివిటీని అందుబాటులోకి తేవాలనుకుంటోంది. ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ ఈ మేరకు ఓ విజన్ రూపొందిం చింది. 2031–32 పేరుతో తీసుకొచ్చిన ఈ విజన్‌ను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా గవర్నింగ్ కౌన్సిల్ ముందు ఉంచారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆదివారం జరిగిన భేటీలో పనగారియా దీన్ని ప్రజెంట్ చేశారు. పూర్తిస్థాయి అక్షరాస్యత గల సమాజాన్ని ఏర్పాటుచేసి, ప్రపంచస్థాయి సౌకర్యాల నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు అన్నీ ప్రజలకు అందించాలని నీతి ఆయోగ్ ఈ విజన్‌ను రూపొందించింది. ప్రజలు నివసించే ప్రాంతాల్లో నాణ్యమైన గాలి, నీటి సదుపాయాలు, అత్యాధునిక రోడ్లు, రైల్వేలు, ఎయిర్ కనెక్టివిటీ విస్తరింపజే యాలని పేర్కొంది. 2015–16లో ఉన్న ఒక్కొక్కరి తలసరి ఆదాయాన్ని రూ. 1.06 లక్షల నుంచి మూడింతలు పెంచి 2031–32కల్లా రూ. 3.14 లక్షలకు చేర్చాల ని ప్రతిపాదించింది. అంతేకాక, స్థూల దేశీయోత్పత్తిని రూ. 137 లక్షల కోట్ల నుంచి రూ. 469 లక్షల కోట్లకు పెంచాలన్నది లక్ష్యంగా నీతి ఆయోగ్ నిర్దేశించింది.