ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్, పాక్‌ల మాటల యుద్ధం వాడి, వేడిగా సాగింది. కశ్మీరీల పోరాటాన్ని భారత్ దారుణంగా అణచేస్తోందని దాయాది దేశం ప్రధాని షాహిద్ కఖాన్ అబ్బాసీ విషం చిమ్మారు. స్వల్పకాలిక యుద్ధానికి తెర తీసినా భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఐరాసలో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతినిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. అబ్బాసీ ప్రసంగాన్ని ఐరాసలో భారత ప్రతినిధి ఈనామ్ గంభీర్ చీల్చి చెండాడారు. ఉగ్రవాదానికి పాక్ అందిస్తున్న సాయాన్ని ప్రస్తావిస్తూ.. దాయాది బండారాన్ని విశ్వ వేదికపై బట్టబయలు చేశారు. ‘మీది స్వచ్ఛమైన భూమిగా పేర్కొనే పాకిస్తాన్ కాదు.. ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారిన టెర్రరిస్తాన్’ అంటూ నిప్పులు చెరిగారు.
ఐక్యరాజ్యసమితి: భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగింది. దాయాదిని ‘టెర్రరిస్తాన్’ అని ఘాటుగా విమర్శిస్తూ.. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాక్ పుట్టినిల్లుగా మారిందని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రతినిధి ఈనామ్ గంభీర్ పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్ వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాక్.. తామే ఉగ్రబాధితులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. అంతకుముందు ఐరాస సమావేశంలో పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ‘ఎల్‌వోసీని దాటివస్తే భారత్‌కు దీటుగా సమాధానమిస్తామ’ంటూ చేసిన వ్యాఖ్యలకు గంభీర్ ఘాటుగా సమాధానమిచ్చారు. కాగా, తమపై ఒత్తిడి పెంచేందుకు భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ రూపొందిస్తున్న వ్యూహాలు విజయవంతం కాకుండా అడ్డుకోగలమని పాకిస్తాన్ పేర్కొంది.
పాక్ చెబితే ప్రపంచం వినాలా?
అంతర్జాతీయ మిలటరీ, అభివృద్ధి సహాయ నిధి నుంచి వచ్చిన కోట్ల డాలర్లను ప్రమాదకర ఉగ్రవాద మౌలికవసతుల కల్పనకే పాకిస్తాన్ వినియోగించుకుందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌లో ఫస్ట్ సెక్రటరీగా ఉన్న ఈనామ్ గంభీర్ విమర్శించారు. ‘పాక్‌కు తను పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది’ అని ఆమె పేర్కొన్నారు. అంతర్గత పరిస్థితులను అదుపులో పెట్టుకోలేని దేశం నుంచి.. మానవ హక్కుల రక్షణ, ప్రజాస్వామ్యంపై పాఠాలు వినేందుకు ప్రపంచం సిద్ధంగా లేదని గంభీర్ వ్యాఖ్యానించారు. ‘అంతర్జాతీయ ఉగ్రవాదంలో టెర్రరిస్తాన్ భాగస్వామ్యం అసామాన్యం. పాకిస్తాన్ తీరు ప్రపంచానికి ఇబ్బందులు కలిగిస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని గంభీర్ స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినంత మాత్రాన భారత భౌగోళిక సమగ్రతకు భంగం కలిగించటంలో విజయం సాధించలేదన్నారు.
పాకిస్తాన్ ఉగ్ర కేంద్రం: అఫ్గానిస్తాన్
ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్.. అంతర్జాతీయ సమాజాన్ని పక్కదారి పట్టిస్తూ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుండా జాగ్రత్త పడుతోందని అఫ్గానిస్తాన్ ఆరోపించింది. ఐరాస సర్వప్రతినిధి సభలో అఫ్గాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘పాక్‌తో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అఫ్గాన్ నిరంతరాయంగా వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తోంది. కానీ పాకిస్తాన్ ఇందుకు సుముఖంగా లేదు. మా దేశంలో తాలిబాన్ స్థావరాలున్నాయని పాక్ ఆరోపిస్తోంది. కానీ అవన్నీ వారి భూభాగంలోనే ఉన్నాయి. అంతర్జాతీయ సమాజాన్ని పక్కదారి పట్టిస్తూ.. ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసిన వారికీ ఆశ్రయమిస్తూ పాక్ తన వక్రబుద్ధిని చాటుకుంటోంది’ అని ఘాటుగా విమర్శించారు.
1971లో పాక్ మారణహోమం: హసీనా
బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ 1971లో దారుణ మారణకాండకు ఒడిగట్టిందని.. 30 లక్షల మంది అమాయక ప్రజలను హతమార్చిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు. ఐరాస సర్వప్రతినిధి సభనుద్దేశించి ఆమె మాట్లాడతూ.. ‘1971 మార్చి 25 అర్థరాత్రి పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)పై విరుచుకుపడింది. మతం, జాతి, రాజకీయ విశ్వాసం పేరుతో ప్రజలను అన్యాయంగా చంపేసింది. బంగ్లా మేధావులను పాక్ సైనికులు అత్యంత క్రూరంగా హతమార్చారు. 2లక్షల మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. 9 నెలల తర్వాత భారత సైన్యం సాయంతో పాకిస్తాన్‌ను ఓడించగలిగాం’ అని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదానికి మతం, విశ్వాసం, జాతి అనే తేడాల్లేవు. నాపైనే చాలాసార్లు ఉగ్రదాడియత్నాలు జరిగాయి. అందుకే ఉగ్ర బాధితులకు సరైన భద్రత కల్పించాలని నేను కోరుకుంటున్నా. హింసాత్మక అతివాదానికి మతం పేరు చెప్పి తప్పించుకోవటం సరికాదు. ఉగ్రవాదులకు ఆర్థిక, ఆయుధ సాయం అందకుండా ఐక్యరాజ్యసమితి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని హసీనా పేర్కొన్నారు.
ద్వైపాక్షిక చర్చలే పరిష్కారం: చైనా
కశ్మీర్ వివాదాన్ని భారత్, పాకిస్తాన్‌లు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా శుక్రవారం వ్యాఖ్యానించింది. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమలు చేయాలన్న ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ)తో చైనా విభేదించింది. ఓఐసీ సూచన గురించి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ వద్ద ప్రస్తావించగా, ‘çకశ్మీర్ అంశంపై చైనా వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. ఈ వివాదం ఇప్పటిది కాదు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలను కాపాడుతూ భారత్, పాక్‌లు చర్చల ద్వారా కశ్మీర్ అంశాన్ని పరిష్కరించుకుంటాయని మేం ఆశిస్తున్నాం’ అని అన్నారు.
ఉగ్రవాదానికి పర్యాయపదం పాక్
పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ప్రసంగంలోని ప్రతి అంశానికీ ఈనామ్ గంభీర్ దీటుగా బదులిచ్చారు. ‘పాకిస్తాన్ ప్రదర్శిస్తున్న వాస్తవాల వక్రీకరణ, మోసం, కపట నాటకాల కారణంగా పొరుగుదేశాలన్నీ బాధితులుగా మారాయి. వాళ్లిప్పుడు ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నా వాస్తవాన్ని దాచలేరు. అనతికాలంలోనే ఉగ్రవాద దేశానికి పాకిస్తాన్ పర్యాయపదంగా మారిపోయింది’ అని ఈనామ్ పేర్కొన్నారు. ‘పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన దేశం (ల్యాండ్ ఆఫ్ ప్యూర్) అని అర్థం. కానీ వారు దాన్ని స్వచ్ఛమైన ఉగ్రవాద దేశం (ల్యాండ్ ఆఫ్ ప్యూర్ టెర్రర్)గా మార్చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేస్తూ పాకిస్తాన్ ఇప్పుడు టెర్రరిస్తాన్‌గా మారిపోయింది’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించటాన్ని బట్టి పాక్‌లో తాజా పరిస్థితిని అంచనా వేయవచ్చని ఈనామ్ గంభీర్ పేర్కొన్నారు.
కశ్మీర్ పోరాటాన్ని అణచివేస్తున్నారు: పాక్ ప్రధాని అబ్బాసీ
తొలిసారి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన పాక్ ప్రధాని అబ్బాసీ.. కశ్మీర్‌లో ప్రజలు స్వాతంత్య్రం కోసం చేస్తున్న పోరాటాన్ని భారత్ క్రూరంగా అణచివేస్తోందని పేర్కొన్నారు. ఐరాస కశ్మీర్‌పై ప్రత్యేక ప్రతినిధిని నియమించాలని ఆయన కోరారు. ‘కశ్మీర్ సమస్య ధర్మబద్ధంగా, శాంతియుతంగా, వీలైనంత త్వరగా పరిష్కారం కావాలి. శాంతి చర్చలను కొనసాగించేందుకు భారత్ సిద్ధంగా లేదు. కాబట్టి, జమ్మూకశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. కశ్మీర్‌కు ప్రత్యేక దూతను ఏర్పాటుచేసేలా ఐరాస సెక్రటరీ జనరల్ నిర్ణయం తీసుకోవాలి. భద్రతామండలి తీర్మానాలు అమలయ్యేలా ఆ దూత చర్యలు తీసుకోవాలి’ అని అబ్బాసీ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి భారత్ 600 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినా పాకిస్తాన్ నిగ్రహంగా ఉందన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించుకునేందుకు భారత్‌తో శాంతియుత చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం పాక్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటాన్ని భారత్ మానుకోవాలన్నారు. ‘ఒకవేళ నియంత్రణ రేఖ దాటి భారత్ ముందుకొస్తే దీటైన జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అబ్బాసీ వెల్లడించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరాటం కారణంగా చాలా నష్టపోయామన్నారు.
దోవల్ వ్యూహాలు ఫలించనీయం
పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అనుసరిస్తున్న ‘అఫెన్సివ్ డిఫెన్స్, డబుల్ స్క్వీజ్’ వ్యూహాలను విజయవంతం కానీయబోమని పాకిస్తాన్ పేర్కొంది. ఈ ప్రాంతం లో తన ఆధిపత్యం పెంచుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామంది. ‘ఈ ప్రాంతంలో భారత ఆధిపత్యాన్ని పెంచేందుకు అజిత్ దోవల్ దూకుడైన రక్షణ వ్యూహం, అంతర్గతంగా, అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే అఫెన్సివ్ డిఫెన్స్, డబుల్ స్క్వీజ్ వ్యూహలను ప్రయోగిస్తున్నారు. వీటిని ఫలించనీయం. పాక్‌లో అల్లకల్లోలం సృష్టించాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఉగ్రవాదం, గూఢచర్యం ద్వారా భారత్ చేస్తున్న ప్రయత్నాలు కలలుగానే మిగిలిపోతాయి’ అని ఐరాసలో పాకిస్తాన్ ప్రతినిధి టిపూ ఉస్మాన్ పేర్కొన్నారు.
హెచ్–1బీపై టిల్లర్‌సన్‌తో సుష్మ చర్చలు
అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్‌తో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తొలిసారిగా శుక్రవారం సమావేశమై హెచ్–1బీ, ఉగ్రవాదం సహా పలు విషయాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్–అమెరికా రాజకీయ, ఆర్థిక భాగస్వామ్యంపై ఇద్దరు మంత్రులు చర్చించారు. అమెరికాలోని భారత సాంకేతిక సంస్థలు అధికంగా ఆధారపడే హెచ్–1బీ వీసాల విషయాన్ని సుష్మ ఈ భేటీలో ప్రస్తావించారు. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఉగ్రవాదం తదితర ప్రాంతీయ అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగాయి. కాగా, ఐరాస సర్వప్రతినిధి సమావేశంలో సుష్మ శనివారం ప్రసంగించనున్నారు.