4వ బుల్లెట్ పేల్చిందెవరు?
గాంధీపై గాడ్సే కాకుండా మరో వ్యక్తి కాల్పులు జరిపాడా?
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ హత్య వెనక అసలు కారణమేంటి? 1948, జనవరి 30న గాంధీ హత్య సమయంలో గాడ్సే, ఆప్టేతోపాటుగా మరో హంతకుడూ అక్కడ ఉన్నాడా? జాతిపితను నాథూరామ్ గాడ్సే మూడుసార్లు కాల్చాడని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. అయితే నాలుగో బుల్లెట్ కూడా గాంధీ శరీరంలో ఉందని నాటి మీడియాలో కథనాలొచ్చాయి. గాడ్సే మూడుసార్లు కాలిస్తే.. నాలుగో బుల్లెట్ పేల్చిందెవరు? ఈ ప్రశ్నలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. గాంధీ హత్యకు సంబంధించి అసలు విషయాల్ని దాచిపెట్టేందుకు చరిత్రలోనే అతిపెద్ద కుట్ర జరిగిందనే అనుమానాలనూ పిటిషన్ లేవనెత్తింది.
హత్యతో సంబంధం లేని వినాయక్ దామోదర్ సావర్కర్‌పై నిందమోపేందుకు ఆధారాలున్నాయా? అని పిటిషన్ ప్రశ్నించింది. ముంబైకి చెందిన చరిత్ర పరిశోధనకారుడు, అభినవ్ భారత్ సంస్థ ట్రస్టీ డాక్టర్ పంకజ్ ఫడ్నిస్ ఈ పిటిషన్ వేశారు. గాంధీ హత్యపై విచారణ జరపాలంటూ 1966లో అప్పటి ప్రభుత్వం వేసిన జస్టిస్ జేఎల్ కపూర్ కమిషన్ అసలు వాస్తవాలను, కుట్ర కోణాన్ని వెల్లడించడంలో పూర్తిగా విఫలమైందని, ఇందుకోసం కొత్త కమిషన్‌ను వేయాలని కోరారు.
3 బుల్లెట్ల సిద్ధాంతం తప్పు!
గాంధీ హత్య కేసులో∙కోర్టులు 3 బుల్లెట్ల సిద్ధాంతంపైనే పూర్తిగా ఆధారపడటాన్ని ఫడ్నిస్ ప్రశ్నించారు. దీని ఆధారంగానే గాడ్సే, నారాయణ్ ఆప్టేలకు 1949లో ఉరిశిక్ష విధించారు. ‘నాటి మీడియా రిపోర్టులు, నా పరిశోధనల ప్రకారం గాంధీ శరీరంలో 4 బుల్లెట్లు దిగాయి.
7 బుల్లెట్లుండే గాడ్సే పిస్టల్ నుంచి 4 వినియోగించని బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే నాలుగో బుల్లెట్ గాడ్సే పిస్టల్ నుంచి వచ్చే అవకాశమే లేదు. అంటే కచ్చితంగా మరో హంతకుడు అక్కడే ఉన్నాడు. అతను ఎవరనేది ఇంతవరకు తేలలేద’దన్నారు. సరైన సాక్ష్యాల్లేవంటూ సావర్కర్‌ను సంశయలాభం కింద వదిలేసిన సంగతి తెలిసిందే.
గాంధీ ఆలోచనను చంపేశారు!
దేశ విభజన తప్పదని తెలిశాక..భారత్–పాక్ ప్రజల మధ్య సత్సంబంధాలుండేలా గాంధీ–జిన్నా చేసిన ప్రయత్నాన్ని అమలుకాకుండా చూసేందుకే మహాత్ముడి హత్య జరిగిందని ఫడ్నిస్ ఆరోపించారు. గాంధీ–జిన్నా ప్రయత్నం అమలుకాని కారణంగానే ఇప్పటికీ భారత్–పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నారు.