'అనుమానాలు అవసరం లేదు'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై అనుమానాలు అవసరం లేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. పీడీపీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నామని, ఇందుకు పీడీపీ ముందడుగు వేయాల్సిన అవసరముందన్నారు. 8 నెలల క్రితం రెండు పార్టీల మధ్య కుదిరిన సయోధ్య కొనసాగాలని ఆకాంక్షించారు.
కాగా, బీజేపీకి పీడీపీ ఎలాంటి షరతులు పెట్టలేదని కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తెలిపారు. పీడీపీ, బీజేపీ పొత్తు విచ్ఛిన్నానికి కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.