యుద్ధం కోరుకోం.. రెచ్చగొడితే గట్టి సమాధానం
భారతదేశం ఎవరితోనూ యుద్ధాన్ని లేదా సంఘర్షణను ఎప్పటికీ కోరుకోదని.. కానీ ఎవరైనా రెచ్చగొడితే మాత్రం వారికి గట్టి సమాధానం చెబుతామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఇటీవల మన జవాన్లు చెప్పిన సమాధానమే అందుకు ఉదాహరణ అన్నారు. ఇతరులను పదే పదేప విసిగించేందుకు కూడా కొంతమంది జనం ఉంటారని, వాళ్లను తాము నిశ్శబ్దంగానే డీల్ చేస్తామని అన్నారు. మన ఆర్మీ కూడా నిశ్శబ్దంగానే సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని వెంకయ్య చెప్పారు.
సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలను విడుదల చేయాలన్న ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల డిమాండ్లను ప్రస్తావిస్తూ అలాంటివాళ్లు చేసే బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు, డిమాండ్లకు స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు. దేశంలోని మరే ఇతర పౌరుడికి భారత సైన్యం నిబద్ధత మీద అనుమానాలు ఉండి ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు.