తమ దారిలో ముళ్లు తొలగించుకోవాల్సి ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
తమ దారిలో ముళ్లు తొలగించుకోవాల్సి ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నీలిరంగు బంద్ గలా నెహ్రూ కోటు వేసుకుని వచ్చిన ఆయన.. ఈసారి నిలబడే బడ్జెట్ ప్రసంగం చేశారు. ఆయన ఏం చెప్పారంటే..
దేశం ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. రాష్ట్రాలు ఇంతకుముందుకంటే చాలా బలోపేతం అయ్యాయి. ప్రజల కోసం ఖర్చుపెట్టే ప్రతి పైసాతో ఉద్యోగావకాశాల కల్పన లాంటి ప్రయోజనాలు ఉంటాయి.
''ఇప్పటికి కొన్ని పూలు పూయించాం.. మరికొన్ని పూయించాల్సి ఉంది, కానీ ఈ దారిలో తోటలో ముళ్లు చాలా తొలగించాల్సి ఉంది'' అన్నారు. మాది రోజుకు 24 గంటలూ, ఏడాదికి 265 రోజులూ పనిచేసే ప్రభుత్వం. కరెంటు ఖాతా లోటు జీడీపీలో 1.3 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. జీడీపీ బాగా పెరగుతోంది. దాంతో భారతదేశం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో భాగంగా కనిపిస్తోంది. రూపాయి 6.4 శాతం బలోపేతం అయ్యింది. మనది మేజర్ ఎకానమీలలో రెండో అతిపెద్ద స్టాక్ మార్కెట్. భారత ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు. మా చర్యలు కేవలం ప్రధాన రంగాలకే పరిమితం కాలేదు. బాలికల విద్య, యువతకు ఉపాధి, పన్నుల సంస్కరణలు, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, డిజిటల్ కనెక్టివిటీ, ప్రభుత్వంలో మెరుగైన పనితీరు, ఈశాన్య రాష్ట్రాల్లో మెరుగైన కనెక్టివిటీ అన్నీ ఉండాలనుకుంటున్నాం. అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా తీసుకొస్తాం. ఇప్పటికే 2014-15లో 50 లక్షల టాయిలెట్లు కట్టించాం. మొత్తం 6 కోట్ల టాయిలెట్లు కట్టాలన్నది లక్ష్యం. ఈ 9 నెలల్లో ఆర్థికరంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం. జనధన్ యోజనతో ప్రజలకు ప్రయోజనాలను నేరుగా అందిస్తాం. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం మా ప్రభుత్వం సాధించిన మరో విజయం. ఈ ఏడాది ఆర్బీఐ చట్టాన్ని సవరిస్తాం. రెండంకెల వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతుంది. అప్పటికి దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పట్టణ భారతంలో 2 కోట్ల ఇళ్లు, గ్రామీణ భారతంలో 4 కోట్ల ఇళ్లు కట్టాలని లక్ష్యం పెట్టుకున్నాం. ప్రతి ఇంటికీ 24 గంటల విద్యుత్ సరఫరా, నీటి సరఫరా ఉండాలని అనుకుంటున్నాం. దేశంలో మిగిలిన 20 వేల గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా కోసం సౌర విద్యుత్ కల్పించాలని భావిస్తున్నాం.