‘చిన్నమ్మ జైలులో బానే ఉన్నారు.. త్వరలో చెన్నైకి’
బెంగళూరు: ఇప్పుడ్పిపుడే జైలు వాతావరణాన్ని చిన్నమ్మ శశికళ అలవాటు చేసుకుంటున్నారని అన్నాడీఎంకే కర్ణాటక విభాగం కార్యదర్శి వీ పుగాజెండి తెలిపారు. అయితే, ఆమె వయోభారం రీత్యా కొన్నిప్రత్యేక సౌకర్యాలు అవసరం అని చెప్పారు. వాటికోసం మరోసారి కూడా దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం బెంగళూరులోని జైలులో శశికళ ఉంటున్న విషయం తెలిసిందే. తనకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటుచేయాలని చేసుకున్న వినతికి కోర్టు నిరాకరించింది. అయితే, తనకు ఓ టేబుల్ ఫ్యాన్, మంచి పరుపునైనా అనుమతించాలని, తన ఆరోగ్యం, వయసు రీత్యా అవి అవసరం అని మరోసారి తన పిటిషన్‌లో పేర్కొన్నారట.
‘చిన్నమ్మ బాగున్నారు. కాకపోతే కాస్తంత నీరసంగా ఉన్నారు. ఆమె షుగర్ లెవల్, రక్తపోటు సాధారణంగానే ఉంది. ఇప్పుడిప్పుడే ఆమె జైలు వాతావరణానికి తగినట్లుగా సర్దుకుంటున్నారు. వయసు, ఆరోగ్యం దృష్ట్యా చిన్నచిన్న సౌకర్యాలకోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. అవి ఆమెకు అందుతాయని నేను ఆశిస్తున్నాను.
ఆమెను చెన్నైలోని కేంద్ర కారాగారంలోకి తరలించేంత వరకు ఎటాచ్ బాత్‌రూమ్‌తో కూడిన సెల్, ఒక మంచం, పరుపు, ఒక టేబుల్ ఫ్యాన్‌లాంటివి ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె విజ్ఞప్తి సరైనదే’ అని కూడా పుగాజెండి చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి త్వరలోనే న్యాయవాదులతో జైలు వద్దకు వచ్చి ఆమెను చెన్నై తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. గతంలో కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న అనుభవం శశికళకు ఉందని చెప్పారు.