‘దీదీ’కే మరోసారి అధికారం?
రాజకీయ చైతన్యానికి మారుపేరుగా మార్మోగిన పశ్చిమ బెంగాల్ 16వ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్తుత పాలకపార్టీ ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మరోసారి గెలుస్తుందనే విషయంపై భిన్నాభిప్రాయాలు లేవు. అయినా, ఈ ఎన్నికలపై మీడియాలో, రాజకీయవర్గాల్లో ఆసక్తి తగ్గలేదు. 294 సీట్లున్న ఈ రాష్ట్రంలో కిందటి(2011) ఎన్నికల్లో తృణమూల్‌తో పొత్తుపెట్టుకుని పోటీచేసిన కాంగ్రెస్ దశాబ్దాలుగా రాజకీయ బద్ధశత్రువులుగా ఉన్న కమ్యూనిస్టులతో కలిసి పోటీచేస్తోంది. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రకాల అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అప్పటి నుంచీ ప్రధాన వామపక్షమైన సీపీఎంతో శత్రుత్వమే ఉంది.
అలాంటిది కిందటి ఎన్నికల్లో తృణమూల్ నేత మమతా బెనర్జీతో చేతులు కలిపి 34 ఏళ్లు పాలించిన సీపీఎంను కూలదోయడంలో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత పరిణామాల వల్ల కాంగ్రెస్ తృణమూల్‌కు దూరమైంది. మమత ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక వర్గాల ప్రజలతోపాటు ముస్లింలు తృణమూల్‌కు దగ్గరయ్యారు. సంప్రదాయ ఓటర్లుగా ఉన్న ఈ మైనారిటీలు సీపీఎంకు దూరమయ్యారు. దాదాపు 25 శాతం ముస్లింలు ఉన్న బెంగాల్‌లో మమత వారి సంక్షేమానికి తీసుకున్న చర్యలు వారిని తృణమూల్‌కు దగ్గరయ్యేలా చేశాయి. ఫలితంగా మతం రంగు పులుముకున్న రాజకీయాలు రాష్ర్టంలో బీజేపీ బలపడడానికి అవకాశమిచ్చాయి. కాంగ్రెస్, సీపీఎం-దాని మిత్రపక్షాలు, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తే, తృణమూల్‌కు ప్రధాన ప్రత్యర్థి పక్షంగా బీజేపీయే ఆవిర్భవించవచ్చనే అంచనాతో కాంగ్రెస్, సీపీఎంలు చేతులు కలిపాయి. ఈ కొత్త రాజకీయ సమీకరణతో వామపక్షాలు, కాంగ్రెస్ బాగా దెబ్బతినే ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. అదీగాక బీజేపీ ఎదుగుదలకు బ్రేక్ పడడానికి ఈ పొత్తు ఉపకరిస్తుందని విశ్లేషిస్తున్నారు.
రే, బసు, బుద్ధ మినహా అందరు సీఎంలూ అవివాహితులే...
బీసీ రాయ్ నుంచి మమత వరకూ బెంగాల్‌కు 8 మంది ముఖ్యమంత్రులుగా పనిచేయగా వారిలో వరుసగా సీఎంలైన ముగ్గురు సిద్ధార్థ శంకర్‌రే(1972-77), జ్యోతి బసు(1977-2000), బుద్ధదేవ్ భట్టాచార్య(2000-2011) మాత్రమే వివాహితులు. మిగిలిన ఐదుగురూ(పీసీ ఘోష్, బీసీ రాయ్, పీసీ సేన్, అజయ్ ముఖర్జీ(1967-69, 1969-70), మమతా బెనర్జీ(2011 నుంచి ఇప్పటి వరకూ) పెళ్లి చేసుకోలేదు. అవివాిహ తులుగా ఉండిపోవడం, ఆలస్యంగా పెళ్లాడడం బెంగాలీ సమాజంలో మామూలే.
34 ఏళ్ల మార్క్సిస్టుల పాలన
1977 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నాయకత్వంలోని వామపక్ష ఫ్రంట్(సీపీఎంకు సొంతగానే మెజారిటీ) సంపూర్ణ మెజారిటీ సాధించింది. సీనియర్ నేత జ్యోతిబసు ముఖ్యమంత్రిగా వరుసగా 1982, 87, 91, 96 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగింది. వరుసగా 23 ఏళ్ల 137 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగి జ్యోతిబసు రికార్డు సృష్టించారు. 2000 నవంబర్‌లో ఆరోగ్యకారణాలతో ఆయన పదవి నుంచి వైదొలగడంతో ఆయన అనుచరుడు, తర్వాతి తరం నేత 56 ఏళ్ల బుద్ధదేవ్ భట్టాచార్యకు సీఎం పదవి దక్కింది. అన్నివిధాలా బసుకు మంచి వారసునిగా పేరుతెచ్చుకున్న బుద్ధదేవ్ కొద్ది నెలలకే 2001 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కూటమిని విజయపథాన నడిపించారు. మళ్లీ ఐదేళ్ల మంచి పాలన తర్వాత 2006లో సీపీఎంను, లెఫ్ట్ ఫ్రంట్‌ను అంతకు ముందు కనీవినీ ఎరగని రీతిలో గెలిపించి, రికార్డు స్థాయిలో మెజరిటీ సాధించిపెట్టారు. సీపీఎం జ్యోతిబసు హయాంలో జరిగిన ఎన్నికల్లో కన్నా ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు(294కు 176 సీట్లు) గెలుచుకుంది.
రెండోసారి అన్నీ తప్పిదాలు
బుద్ధదేవ్ 2006 భారీ విజయం తర్వాత సింగూరు టాటా-నానో కార్ల ఫ్యాక్టరీకి స్థల సేకరణ, నందిగ్రామ్‌లో ఇండొనీసియా కంపెనీకి భూసేకరణ సందర్భాల్లో ప్రజలపై ప్రభుత్వ దమనకాండకు నాయకత్వం వహించి అప్రతిష్టపాలయ్యారు. ఈ సమయంలో జన ం తరఫున పోరాడుతూ బలపడుతున్న మావోయిస్టుల అణచివేత పేరుతో అటవీ ప్రాతాల్లో ఆదివాసీలపై పోలీసుదాడులు, జులుం పెరిగిపోయాయి. మొదట్నించీ కమ్యూనిస్టులకు సానుభూతిపరులుగా ఉన్న మధ్యతరగతి ప్రజలు (భద్రలోక్) మార్క్సిస్టులకు దూరమయ్యారు. ఈ క్రమంలో మావోయిస్టుల నుంచి మధ్యతరగతి మేధావులు, పేద ప్రజలు తృణమూల్ బలపడడానికి కారకులయ్యారు.
ఫలితంగా 34 సుదీర్ఘ పాలన తర్వాత కమ్యూనిస్టులు, పదేళ్ల ఏలుబడి తర్వాత బుద్ధదేవ్ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూడాల్సివచ్చింది. బుద్ధదేవే తన నియోజకవర్గంలో తృణమూల్ చేతిలో ఓడిపోయారు. అక్రమాలతో, అణచివేతతో జరిగిన 1972 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే జ్యోతిబసు ఓడిపోయారు (అక్రమాలను పసికట్టి పోలింగ్‌కు ముందే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు.). దాదాపు మూడున్నర దశాబ్దాలు సాగిన పాలనలో మార్క్సిస్టుల తప్పిదాలు, ముఖ్యంగా బుద్ధదేవ్ చివరి సంవత్సరాల్లో చేసిన పెద్ద పొరపాట్లు 2011 ఎన్నికల్లో తృణమూల్-కాంగ్రెస్ కూటమికి ఘనవిజయం సాధించిపెట్టాయి. పదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగిన బుద్ధదేవ్ సీపీఎం అధికారం కోల్పోవడానికి ప్రధాన ముద్దాయిగా కనిపించారు. జ్యోతిబసు కాలం నుంచీ పాలకపక్షమైన సీపీఎం కార్యకర్తలతో జరిపిన వీధిపోరాటాలతో రాటుదేలిన మమత అంతకు ముందు ఎవరూ ఊహించనిరీతిలో కాంగ్రెస్ వీడి, ప్రాంతీయపార్టీ స్థాపించి మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.
తృణమూల్ పాలనలో సీపీఎం ఛాయలు
ప్రతిపక్షంలో ఉండగా సీపీఎంనే అనుకరించిన మమత అధికారంలోకి వచ్చాక కూడా లెఫ్ట్ ఫ్రంట్ విధానాలు కొన్నింటిని అనుసరించారు. ప్రధానంగా ప్రతిపక్షాలను అణచివేయడంలో, అధికారాన్ని గరిష్టస్థాయిలో కార్యకర్తలు, నాయకులకు ఉపయోగపడేలా చూడడంలోనూ మార్క్సిస్టుల దారిలోనే మమత ప్రయాణిస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికే బాహాటంగా వినిపిస్తున్నాయి. పాతికేళ్లకు పైగా మార్క్సిస్టులతో పోరాడిన మమతా బెనర్జీ మనుషులు తాము అధికారపార్టీ అనే విషయం మరచి వీధిపోరాటాలు కొనసాగిస్తున్నారు. అలాగే, 34 ఏళ్లు పాలకపక్షంగా కొనసాగిన సీపీఎం అధికారం కోల్పోయి ఐదేళ్లు దాటినా సమరశీల ప్రతిపక్షపార్టీ పాత్ర పోషించడం ఇంకా నేర్చుకోలేకపోతోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోల్‌కతాలోని సీపీఎం రాష్ర్ట ప్రధాన కార్యాలయం(అలీముద్దీన్ స్ట్రీట్‌లోని ముజఫర్ అహ్మద్ భవన్) వైపు వెళ్లిన మీడియా ప్రతిధులకు నిర్మానుష్యంగా కనిపించింది. ఎన్నికల సమయంలో ఉండాల్సిన కోలాహలం, కార్యకర్తల్లో ఉత్సాహం కరువయ్యాయి.
అత్యాచారాలు, అవినీతి, కుంభకోణాలు
తృణమూల్ కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో మహిళలపై అత్యాచారాలు, ప్రతిపక్షాలపై హింసాత్మక దాడులు జరిగాయి. సీపీఎం సర్కారు మాదిరిగానే మావోయిస్టులను, వారి నేతలను బూటకపు ఎన్‌కౌంటర్లలో పోలీసులు చంపివేశారని వార్తలొచ్చాయి. తెలుగు ప్రాంతానికి చెందిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావును అదే పద్ధతిలో బెంగాల్ పోలీసులు కాల్చిచంపారు. శారదా కుంభకోణంలో తృణమూల్ ఎంపీలు, అగ్రనేతలు, మంత్రుల ప్రమేయం ఉందని ఆరోపణలొచ్చాయి. ఇంత జరుగుతున్నా బెంగాల్ ప్రజలు మమతనే మరోసారి ముఖ్యమంత్రిని చేసేలా ఉన్నారని ఎన్నికల సర్వేలు సూచిస్తున్నాయి. వరుసగా ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో మార్క్సిస్టుల నేతృత్వంలోని వామపక్షాలను గద్దెనెక్కించిన బెంగాలీలు మమతకు మరో అవకాశం తప్పక ఇస్తారని 2011 నుంచి జరుగుతున్న ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు నిరూపిస్తున్నాయి.
63 నుంచి 86 ఏళ్ల వరకూ బసుకు సీఎం పదవి
రెండుసార్లు ఉపముఖ్యమంత్రిగా బంగ్లా కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్ ముఖర్జీ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాల్లో పనిచేసిన జ్యోతి బసు ఇంగ్లండ్‌లో న్యాయశాస్త్రం చదువుకున్న బారిస్టర్. కులీన కాయస్థ కుటుంబంలో జన్మించిన బసు చివరికి 1977లో 63 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. 86వ ఏట పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు.
డాక్టర్ సీఎం బీసీ రాయ్
స్వాతంత్య్రం వచ్చాక రెండో ముఖ్యమంత్రిగా 1948లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ నేత డాక్టర్ బిధాన్ చంద్ర(బీసీ)రాయ్ మొత్తం 14 ఏళ్ల 157 రోజులు సీఎంగా 1962 వరకూ కొనసాగారు. ఆ తర్వాత సీఎం పదవి చేపట్టిన ఏ కాంగ్రెస్ నేతా ఇంత కాలం పదవిలో లేరు. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో సీఎం అయిన సిద్ధార్థ శంకర్‌రే(రాయ్) ఐదేళ్లు 1977 ఎన్నికల వరకూ పదవిలో కొనసాగారు. ఆయనే రాష్ట్రంలో చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. 1957 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం బీసీ రాయ్ కలకత్తా నగరంలోని బౌబజార్ అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు రోజు మధ్యాహ్నం వరకూ కమ్యూనిస్టు(సీపీఐ)అభ్యర్థి మహ్మద్ ఇస్మాయిల్ కన్నా దాదాపు 200 ఓట్లు వెనకబడి ఉండి, సాయంత్రానికి పుంజుకుని అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించడం సంచలనమైంది. ఫలితం ప్రకటించడానికి ముందు లెక్కింపు కేంద్రంలో కరెంటు పోవడం అనుమానాలకు దారితీసిందని ప్రఖ్యాత ఆర్థికవేత్త, జ్యోతి బసు కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా ఉన్న డా.అశోక్‌మిత్రా ఓ ఆంగ్ల వార పత్రికలో రాసిన వ్యాసంలో వెల్లడించారు.
1984లో జెయింట్ కిల్లర్..2011లో సీఎం పదవి..
మమతా బెనర్జీ కాంగ్రెస్ టికెట్‌పై 1984 డిసెంబర్ ఆఖరులో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్‌లో సీనియర్ సీపీఎం నేత సోమనాథ్ చటర్జీని ఓడించి ‘జెయింట్ కిలర్’ వెలుగులోకి వచ్చారు. అయితే, సీపీఎం నేతలు, కార్యకర్తలతో వీధిపోరాటాలకు దిగుతున్న మమతను ఓడించాలనే దృఢ లక్ష్యంతో 1989 డిసెంబర్ లోక్‌సభ ఎన్నికల్లో అదే జాదవ్‌పూర్ నియోజకవర్గంలో ఆమెపై జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మాలినీ భట్టాచార్యను సీపీఎం తరఫున ఎన్నికల బరిలోకి దింపారు. మమతను మాలిని ఓడించారు గాని ఏడాదిన్నరకే లోక్‌సభ రద్దుతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో జాదవ్‌పూర్‌లోనే మమత చేతిలో ఓడిపోయారు.