ఆ 24 గంటలు ఏం చేశారు?
ఉగ్రదాడులను పసిగట్టడంలో భద్రతా వైఫల్యం
పఠాన్‌కోట్: గురువారం ఎస్పీని బంధించి, చితగ్గొట్టి వదిలిపెట్టాక 24 గంటలపాటు ఉగ్రవాదులు ఏం చేశారు? వీరి కదలికలను గుర్తించకపోవటం పంజాబ్ పోలీసుల వైఫల్యమేనా?ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలివి. ఈ ఘటన తర్వాత పంజాబ్-పాక్ సరిహద్దుల్లో నిఘా పెంచినా.. అంతకుముందే వచ్చేసిన ఉగ్రవాదుల కదలికలను గుర్తించకపోవటంలో నిఘా వ్యవస్థ వైఫల్యమూ కనబడుతోంది. డిసెంబర్ 30,31న దాదాపు 15 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. పఠాన్‌కోట్‌తోపాటు.. పంజాబ్‌లో ఇతర ఐఏఎఫ్ బేస్‌లున్నాయి.
ఆదంపూర్, హల్వారా, బథిండా, అమృత్‌సర్, పాటియాలాల్లో వైమానిక దళాల కీలక కేంద్రాలున్నాయి. ఇలాంటి ప్రాంతంలో ఎస్పీ కిడ్నాప్ తర్వాత అప్రమత్తంగా ఉన్నట్లు ప్రకటించినా ఐదుగురు ఉగ్రవాదులు తిరగగలిగారంటే.. భద్రతా లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ‘నాకాబందీ నిర్వహిస్తుండటం వల్ల ఉగ్రవాదులు వాహనాలు వదిలి నడుస్తూనే ఈ ప్రాంతమంతా తిరిగి ఉండాలి. ఎయిర్‌బేస్ సమీపంలో వారు తిరుగుతుండగా ఎవరికీ అనుమానం రాలేదా? స్థానికులతో పాటు.. భద్రతా దళాలు వీరిని గుర్తించలేదా?’ అని పంజాబ్ మాజీ పోలీసు అధికారి ప్రశ్నించారు.
కిడ్నాపై బయటపడ్డ ఎస్పీ వెల్లడించిన విషయాలను సీరియస్‌గా తీసుకోలేదని అర్థమవుతుందన్నారు. గురుదాస్‌పూర్ ఘటన జరిగినప్పుడు కూడా పంజాబ్ పోలీసులు కునుకుతీస్తున్నట్లు సీసీటీవీల్లో కనిపించింది.
శుక్రవారం పఠాన్‌కోట్ ఎస్పీ కిడ్నాపైన సంగతి తెలుసుకుని.. ఆయనకు కాల్ చేసిన గన్‌మాన్‌కు.. ‘సలాం అలైకూం’ అనే సమాధానం వచ్చింది. ‘ఇది మా ఎస్పీసార్ నెంబరు మీరెవరు మాట్లాడుతున్నారని ప్రశ్నించగానే.. ఫోన్ కట్ చేశారు’ అని ఎస్పీ గన్‌మ్యాన్ తెలిపాడు. దీన్ని బట్టి ఎస్పీని కొట్టి వాహనం తీసుకెళ్లిన వారూ పాక్ ఉగ్రవాదులేననే అనుమానం బలపడుతోంది. మరోపక్క.. ఐఎస్‌ఐకి సమాచారం అందించిన కేసులో ఇటీవలే అరెస్టైన భారత వైమానిక దళం అధికారి కేకే రంజిత్‌ను పంజాబ్‌లో ఉగ్రఘటన నేపథ్యంలో మరోసారి విచారించనున్నారు.
వాళ్లు వస్తుండగానే చూశాం
గగనతల నిఘాతోనే ఎదురుదాడి: ఐఏఎఫ్
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఘటనలో ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లో అడుగుపెడుతుండగానే.. గగనతల నిఘా (ఏరియల్ సర్వీలెన్స్) ద్వారా గుర్తించి సమర్థవంతంగా అడ్డుకున్నామని భారతీయ వైమానిక దళం ప్రకటించింది. ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ విభాగం ముందుగానే హెచ్చరించటంతో అప్రమత్తంగానే ఉన్నామని.. పక్కా ప్రణాళిక, వివిధ విభాగాల సమన్వయంతో ఎదురుదాడి చేయటం వల్లే ఎయిర్‌బేస్‌ను కాపాడుకోగలిగామని పేర్కొంది. మిలటరీ దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు ఎయిర్ బేస్ స్టేషన్‌లోకి వస్తుండటాన్ని గగనతల నిఘా నేత్రం ద్వారా గుర్తించి.. వారిపై కాల్పులు జరిపినట్లు ఈ ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ కీలకమైన మిగ్-21 యుద్ధ విమానాలు, ఎమ్‌ఐ-25 యుద్ధ హెలికాప్టర్లకు బేస్ పాయింట్ కావటం విశేషం.
ఉగ్రదాడుల పంజాబ్
న్యూఢిల్లీ: ఆరునెలల్లో పంజాబ్‌పై ఇది రెండో ఉగ్రదాడి. గతేడాది జూలైలో గురుదాస్‌పూర్‌పై జరిగిన ఉగ్రవాదుల దాడినుంచి తేరుకోకముందే.. అదే తరహాలో దాడికి యత్నం జరగటం సంచలనం సృష్టిస్తోంది. 2001 నుంచి శనివారం ఘటన వరకు పంజాబ్‌లో జరిగిన ఉగ్రవాదుల ఘటనలను ఓసారి పరిశీలిస్తే..
మార్చి 1, 2001: గురుదాస్‌పూర్ ప్రాంతంలో భారత్,పాక్ సరిహద్దుల్లో 135 గజాల సొరంగ మార్గాన్ని గుర్తించారు
జనవరి 1, 2002: పంజాబ్-హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ఐదుగురు స్థానికులు మృతిచెందారు.
జనవరి 31, 2002: హోషియార్‌పూర్ జిల్లాలో బస్‌స్టేషన్‌లో జరిగిన పేలుడులో ఇద్దరు మరణించగా 12 మందికి గాయాలయ్యాయి.
మార్చి 31, 2002: లూధియానా దగ్గర్లోని రైలులో జరిగిన పేలుడులో ఇద్దరు చనిపోయారు.
ఏప్రిల్ 28, 2006: జలంధర్ బస్‌స్టేషన్లో జరిగిన బాంబు పేలుడులో 8 మంది చనిపోయారు.
అక్టోబర్ 14, 2007: లూధియానాలో ఓ థియేటర్లో బాంబు పేలుడులో పదిమంది మరణించగా 40 మందికి పైగా గాయాలయ్యాయి.
జూలై 27, 2015: మిలటరీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. ఓ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేయటంతో.. ఎస్పీతో సహా ఎనిమిది మంది చనిపోయారు.
జనవరి 2, 2016: పఠాన్‌కోట్‌లోని ఐఏఎఫ్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో నలుగురు ఉగ్రవాదులు, ముగ్గురు భదత్రా సిబ్బంది మృతిచెందారు.