బంగాళా దుంప బంగారం అవుతుందా? | what is the truth behind rahul gandhi speech in gujarat election campaign | Sakshi
Sakshi News home page

బంగాళా దుంప బంగారం అవుతుందా?

Published Fri, Nov 17 2017 3:16 PM | Last Updated on Fri, Nov 17 2017 3:33 PM

what is the truth behind rahul gandhi speech in gujarat election campaign - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, గాంధీనగర్‌ : గుజరాత్‌లోని పటానలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ బంగాళా దుంపలతోని బంగారాన్ని తయారు చేసే యంత్రం గురించి వివరించారంటూ సోషల్‌ మీడియా గత రెండు రోజులుగా ఆయన్ని హేళన చేస్తోంది. ‘రాహుల్‌ గాంధీజీ! ఒకపక్క నుంచి బంగాళా దుంపలను పెడితే మరోపక్క నుంచి బంగారం వచ్చే మీ యంత్రం గురించిన ఫార్ములాను తెలియజేయండి. నేను స్టార్టప్‌ కంపెనీ పెడతానని ఒకరు... అసలు రెండు పక్కల నుంచి కూడా బంగాళా దుంపలను పెడితే ఏం వస్తుందని మరోకరు.. బంగాళా దుంపల ఫ్యాక్టరీలోకి వెళ్లేముందు బప్పీలహరీ అన్న శీర్షికతో మెడలో తరిగిన బంగాళా దుంపల దండవేసుకున్న ఫొటోను, ఆ తర్వాత బంగాళా దుంపల ఫ్యాక్టరీ నుంచి వస్తున్న బప్పీలహరీ అంటూ.. మెడలో బంగారు గొలుసు వేసుకున్న బప్పీలహరి ఫొటోను ట్వీట్‌ చేయగా, ఏకంగా ముగి బంగారాన్ని అమ్ముతున్న రాహుల్‌ గాంధీ.. అంటూ ఆలు గడ్డలుగల తోపుడు బండీతో రాహుల్‌ (మార్ఫింగ్‌) ఫొటోను ట్వీట్‌ చేశారు.

ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ మాట్లాడిన సందర్భాన్ని తీసేసి కేవలం కేవలం ‘ఇటు నుంచి ఆలు పెడితే అటు నుంచి బంగారం వచ్చే యంత్రాన్ని ఇస్తాను. ఇటు నుంచి ఆలు పెట్టండి, అటు నుంచి బంగారాన్ని తీసుకోండి. దీనివల్ల ఎంత డబ్బుస్తొందంటే దాన్ని ఏం చేసుకోవాలో కూడా మీకు తెలియదు’ అన్న మాటలను మాత్రమే కత్తిరించి సోషల్‌ మీడియాలో ఎవరో పోస్ట్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో ఇలాంటి ట్వీట్లు వెల్లువెత్తాయి. వాస్తవానికి దేశ ప్ర«ధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ఆదివాసీలకు 40వేల కోట్ల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేస్తానని చెప్పి చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేక పోయారని, వరదల వచ్చిన సందర్భంగా తక్షణ ఆర్థిక సహాయం కింద 500 కోట్ల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి, అందులో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఇక ఆలు రైతులకు ఎలాంటి హామీ ఇచ్చారంటే ఇటు నుంచి ఆలు పెడితే అటు నుంచి బంగారం వచ్చే యంత్రాన్ని ఇస్తానని, ఇటు నుంచి ఆలు పెట్టండి, అటు నుంచి తీసుకోండి’ అని రాహుల్‌ వ్యంగ్యంగా విమర్శించారు.

ఏ మీడియాలోనైనా సరే వ్యంగ్యమైన, హాస్యమైనా, ఛలోక్తులైనా వాస్తవానికి విరుద్ధంగా ఉండకూడదు, ఓ క్యారెక్టర్‌ను హత్య చేసే విధంగా అసలే ఉండకూడదు. ఇక్కడ సోషల్‌ మీడియాలో రాహుల్‌పై హేళన వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి మరి. అసలు బంగాళా దుంపలతో బంగారం అవుతుందా? ఈ వ్యాఖ్యను చూడగానే ఎవరికైనా అది వ్యంగోక్తి అని అర్థం అవుతుంది కదా!


No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement