
ఆమిర్ ఖాన్ చేసిన తప్పేంటి?
ముంబై: దేశంలో నానాటికి పెరిగిపోతున్న అసహన పరిస్థితులపై ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేయడం తప్పా? అసహనానికి వ్యతిరేకంగా చరిత్రకారులు, రచయితలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు తమ జీవన సాఫల్యంలో తమకు లభించిన ఆవార్డులను వెనక్కి ఇచ్చివేయడం నిజం కాదా? వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు భిన్నంగా ఆమిర్ ఖాన్ ఏమైనా మాట్లాడారా? హిందువులైన వారి పట్ల అంత తీవ్ర స్థాయిలో స్పందించని వారు ఆమీర్ మాటలపై ఎందుకంత దుమారం లేవదీస్తున్నారు? మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి అవడం వల్లనేనా. ఆమిర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన ఇంటి ముందు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం అసహనం నిర్వచనం కిందకు రాదా?
ప్రముఖ గజల్ సింగర్ గులాం అలీ పాటను కొన్ని తరాలుగా పదిలంగా గుండెలో దాచుకున్నామే, భారత్‌లో ఎన్నో కచేరీలతో మనల్ని అలరించారే, కేంద్రంలో ప్రభుత్వం మారగానే ముంబైలో ఆయన కచేరిని ఎందుకు రద్దు చేయించారు? అది అసహనం కాదా? గోమాంసం తిన్నారనే ఆరోపణలతోనే దాద్రీలో ఓ ముస్లింను దారుణంగా హత్య చేశారే, అది అసహనం కాదా? కేవలం గోవులను తల్లిగా భావించడం వల్లనే గోహత్యలను నిషేధించారా? అదే నిజమైతే నేడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గుజరాత్‌లో ఆలనాపాలనా లేకుండా వందలాది గోవులు ఎందుకు డొక్కలెండుకుపోయి చస్తున్నాయి?
దేశంలోని అసహనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిని దేశ భక్తులు కాదంటూ దేశం వీడిపోవాల్సిందిగా అసహన వ్యాఖ్యలు చేస్తున్నారు. 1990 దశకం నుంచి దేశం నుంచి ముఖ్యంగా పంజాబ్, గుజరాత్‌ల నుంచి లండన్, అమెరికా, కెనడా, ఇతర యూరప్ దేశాలకు వలసపోతున్న వారి గురించి ప్రభుత్వాలుగానీ, దేశభక్తిపరులుగానీ ఎన్నడైనా ఆలోచించారా? మురికి వాడలు, పేదరికం, అవినీతి కంపును భరించలేమంటూ కన్న తల్లిని వదిలేసి బ్రిటన్‌లో బతుకుతున్న భారతీయులు, వారి సంతతి వారు ఇటీవల వెంబ్లీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీకి నీరాజనాలు పలకగానే దేశభక్తులైపోయారా? మాతృగడ్డపై బతుకుతున్న వారు మాత్రం పరాయులైపోయారా ?- ఇదీ ఓ సెక్యులరిస్ట్ కామెంట్.