ఇక స్విగ్గీ, జొమాటోలకు ‘ఎసరు’! | WhatsApp New Way To Buy And Sell Food In Bengaluru | Sakshi
Sakshi News home page

ఇక స్విగ్గీ, జొమాటోలకు ‘ఎసరు’!

Published Mon, May 6 2019 7:53 PM | Last Updated on Mon, May 6 2019 7:56 PM

WhatsApp New Way To Buy And Sell Food In Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు: హఠాత్తుగా వేసవి వర్షాలు పలకరించడంతో బెంగళూరు వేడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇంకా కురుస్తున్న చినుకుల మాటున వీస్తున్న సన్న గాలులకు మట్టి పరిమళాలు వచ్చి ముక్కును తాకుతుంటే డాక్టర్‌ జయశ్రీ గోపాలన్‌ మైమరచిపోతున్నారు. మహాదేవపురలోని అపార్ట్‌మెంట్, 15వ అంతస్తులో నిలబడి వర్షపు జల్లులకు పులకించిపోతున్న ఆమెకు హఠాత్తుగా ఆకలి గుర్తుకు వచ్చింది. ‘అబ్బా! ఈ వాతావరణంలో వేడి వేడి బజ్జీలు తింటేనా!’ అనుకోగానే ఆమె నోటిలో నీళ్లూరాయి. ఆమె ఇంట్లో ఒంటిరిగా ఉంది. తాను ఒక్కదాని కోసం ఇప్పుడు బజ్జీలు చేసుకోవాలా? అనుకున్నట్లున్నారు. వెంటనే చేతిలోకి సెల్‌ తీసుకున్నారు. అందులో ‘స్నాక్స్‌’ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌నకు ‘స్నాక్స్‌ ఏమున్నాయి ?’ అంటూ మెస్సేజ్‌ పెట్టారు. ‘ఎనిమిది ప్లేట్ల ఆలు, ఉల్లిపాయ బజ్జీలు చేస్తున్నాను. ఇప్పటికే ఆరు ఆర్డర్లు వచ్చాయి, మీకు కావాలంటే ఇప్పుడే ఆర్డర్‌ ఇవ్వండి, అరగంటలో పంపిస్తాను’ అంటూ వెంటనే సమాధానం వచ్చింది.

జయశ్రీ వెంటనే ఓ ప్లేట్‌ ఆర్డర్‌ ఇచ్చారు. 20 నిమిషాలు తిరక్కుండానే టిఫిన్‌ డబ్బాలో వేడి వేడి బజ్జీలు పట్టుకొని ఆ వంట మనిషి పిల్లవాడు వచ్చి ఇచ్చాడు. 30 రూపాయల బిల్లు తీసుకొని వెళ్లిపోయాడు. ‘ఆహా! ఎంత బాగున్నాయి. అచ్చం నేను చేసికున్నట్లే ఉన్నాయి’ అంటూ జయశ్రీ వాటన్నింటిని తినేసింది. ఇలా అడిగిన వారికి అడిగినట్లుగా ఉదయం ఇష్టమైన టిఫిన్లు, మధ్యాహ్నం మంచి భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్‌ చేసి పెడుతోంది అదే ఆపార్ట్‌మెంట్‌లో ఉంటోన్న ఓ వంటామే. ఆ అపార్ట్‌మెంట్‌లో దాదాపు 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. బిజీబీజీగా ఉండే ఆ కుటుంబాలు ఎక్కువ సార్లు ఈ వంటామేపైనే ఆధారపడుతున్నారు. ఇరుగు పొరుగు అపార్ట్‌మెంట్‌ల వారు కూడా ఈ మధ్య ఆ వంటామనే ఆశ్రయిస్తున్నారట.

ఇలాంటి వంటామే ఒక్క మహాదేవపురలోనే కాదు, సర్జాపూర్, బన్నేర్‌గట్టా, హెన్నూర్‌ ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లకు విస్తరించారు. పక్క పక్కనే ఉన్న ఆపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న వారందరితోని వాట్సాప్‌లో స్నాక్స్‌ అనో, బ్రేక్‌ఫాస్ట్‌ అనో, లంచ్‌ అనో, డిన్నర్‌ అనో, హోం ఫుడ్‌ అనో ఓ గ్రూప్‌ను చేసుకొని వంటామెలు (కొన్ని చోట్ల వంటాయనలు కూడా ఉండవచ్చు) మంచి ఓ హోమ్‌ ఫుడ్‌ను సరఫరా చేస్తున్నారు. ఇలాంటి వారితోనే కొంత పెద్ద మొత్తంలో ‘ఫుడ్డీ బడ్డీ’ గ్రూప్‌ పుట్టుకొచ్చింది. దీన్ని రచనా రావు, అనూప్‌ గోపీనాథ్, అకిల్‌ సేతురామన్‌ ఇదివరకే ఏర్పాటు చేయగా, కొత్తగా ఊటాబాక్స్, మసాలా బాక్స్‌ అనే గ్రూపులు పుట్టుకొచ్చాయి. ‘ఫుడ్డీ బడ్డీ’ గ్రూప్‌లో 20 వేల మంది ఉండగా, పూటకు రెండున్నర వేల ఆర్డర్లు వస్తున్నాయట. అందరిదీ ఒకటే సూత్రం. హోం ఫుడ్‌. రుచితోపాటు పరిశుభ్రతను పాటించడం, బయట హోటళ్ల కంటే తక్కువ రేటుకు విక్రయించడం వల్ల వీటి ప్రాబల్యం పెరుగుతోంది.

ఆరు లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న బెంగళూరు ఆహార పరిశ్రమలో ఈ పూటకూళ్ల పరిశ్రమలు రేపు ప్రముఖ పాత్ర వహించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. స్విగ్గీ, జొమాటోలాంటి ఆహార సరఫరా సంస్థలకు ఈ పూటకూళ్లమ్మలను చూసి భయం పట్టుకుందట. ఈ ఆహార సరఫరా సంస్థల బిజినెస్‌ దేశవ్యాప్తంగా 30 కోట్ల డాలర్లకు చేరుకోగా, అందులో 32 శాతం వాటా ఒక్క బెంగళూరు నుంచే వస్తోందట. ఇప్పుడు దానికి చిల్లు పడుతుందన్నది వారి చింత. ఫుడ్‌కు పేరుపోందిన కోరమంగళ ప్రాంతంలోనే దాదాపు 500 రెస్టారెంట్లు ఉన్నాయని, అవి ఉన్నంత వరకు తమకు ఢోకాలేకపోవచ్చని కూడా వారు భావిస్తున్నారు.

ప్రతి అపార్ట్‌మెంట్‌కు ఓ పూటకూలమ్మ పుట్టుకొస్తే ఆహార పరిశ్రమలో గుత్తాధిపత్యం మాత్రం తగ్గుతుంది. అపార్ట్‌మెంట్‌ వాసుల అభిరుచులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ  ‘ఇంటి వంట’కు కూడా మరింత వన్నె తేవచ్చు. కాకపోతే ఇలాంటి వాటికి ఆర్డర్‌ ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక వంటకాల కోసం ఓ రోజు ముందుగా కూడా ఇవ్వాల్సి రావచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement