భద్రాద్రి: జోరుగా వాన కురుస్తుంది.. బిర్యానీ తినాలనిపించింది..బయటకు వెళ్లాలంటే వర్షం.. ఎలా అనిఆలోచించాల్సిన పనిలేదిప్పుడు. చేతిలో సెల్‌ఫోన్ ఉండి అందులో ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటే చాలు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఫోన్ నుంచి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయవచ్చు. లేకుంటే ఆర్థర్ బాయ్‌కి డబ్బులు చెల్లించవచ్చు. అనుకోకుండా చుట్టాలో, స్నేహితులో ఇంటికి వచ్చారనుకొండి ఏ మాత్రం టెన్సన్ పడాల్సిన పనిలేదు. వారు ప్రెషప్ అయ్యే సరికి వేడివేడిగా వారికి మనం ఆర్డర్ చేసిన ఆహారం అందించవచ్చు. ఎండ, వాన, చలి ఏ సమయంలోనైనా ఫుడ్ డెలివరీ యాప్స్‌తో మనకు ఇష్టామైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని ఇంట్లోనే ఆస్వాదిస్తూ ఆరగించవచ్చు. గతంలో నగరాలు, పట్టణాలపై పరిమితమైన ఫుడ్ డెలివరీ యాప్స్ సేవలు ఇప్పుడు పట్టణాలకు సమీపంలోని గ్రామాలకు కూడా విస్తరిస్తున్నాయి.
ఆధ్యాత్మిక కేంద్రమైన భద్రాచలంలోని హోటళ్లు, బేకరీల నుంచి ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్‌తో సారపాక, ఐటీసీ, తాళ్లగొమ్మూరు, కోయగూడెం, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, బూర్గంపాడు ప్రాంతాలకు ఫుడ్ డెలివరీ అందుతుంది. ప్రస్తుతం భద్రాచలం, సారపాకలలోని హోటళ్లు, బేకరీల నుంచి పరిసర గ్రామాలకు స్విగ్గి, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌ల నుంచి సేవలు అందుతున్నాయి. బిర్యానీ, స్నాక్స్, చికెన్, మటన్, ఫిష్ తదితర మాంసాహార వంటకాలు ఆర్డర్ చేసిన అరగంటకే వేడివేడిగా అందుబాటులోకి వస్తున్నాయి.స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్ నుంచి స్విగ్గి, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తొలిసారి యాప్‌లను వినియోగిస్తే ఫుడ్ బిల్లులో ఆఫర్‌లు కూడా వర్తిస్తాయి. అదేవిధంగా పండుగలకు, ఓపెనింగ్‌లకు కూడా కొన్ని హోటళ్లు ఆర్డర్లపై ఆఫర్లను ప్రకటిస్తాయి.
ఫుడ్ డెలివరీ యాప్‌లతో సేవలందించేందుకు స్థానిక యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. సొంత పనులు చేసుకుంటునే చాలామంది యువకులు పార్ట్‌టైమ్ జాబ్‌గా ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్న యువకులు, చదువుకుంటున్న యువకులు కూడా ఈ యాప్‌ల నుంచి సేవలను అందిస్తు ఉపాధిపొందుతున్నారు. పగటిపూట రోజువారీ పనులు చేసుకునే చాలామంది.. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఆర్డర్‌లను హోమ్ డెలివరీ చేస్తు ఉపాధి పొందుతున్నారు. ఫుడ్ డెలివరీ చేసే దూరం, ఫుడ్ పరిమాణాన్ని బట్టి బాయ్స్‌కు వేతనాన్ని అయా సంస్థలు అందిస్తాయి. ఫుడ్ డెలివరీ యాప్‌లతో అటు వినియోగదారులకు, ఇటు హోటళ్లు, బేకరీల నిర్వహకులకు కూడా సౌకర్యవంతంగా ఉంది. ఈ ఫుడ్ డెలివరీ సిస్టమ్‌తో స్థానికంగా చాలామంది యువతకు ఉపాధి లభిస్తుంది. కొన్నేళ్లుగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాలపై పరిమితమైన ఈ యాప్‌లు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి సేవలను అందిస్తున్నాయి.
ఫుడ్ ఆర్డర్‌తో ఈజీగా ఉంది
మనకు కావాల్సింది తినాలనుకున్నప్పుడు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం ఈజీగా ఉంది. మనం ఆర్డర్ చేసిన అరగంట వ్యవధిలోనే ఫుడ్ ఇంటికి వస్తుంది. కొన్ని తప్పని పరిస్థితుల్లో మన ఆకలి తీర్చేందుకు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయటం సులభమైంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా స్విగ్గీ, జొమోటో వంటి సంస్థలు మనకు కావాలి్సన ఫుడ్‌ను ఇంటికే తీసుకువస్తున్నాయి.
– వై శివారెడ్డి, రెడ్డిపాలెం
బంధువులొస్తే భయం లేదు
మనం పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్, బంధువులు ఇంటికి వస్తే వారికి అప్పటికప్పుడు వండి పెట్టలేము. వాళ్లు ఫ్రెష్ అయ్యేసరికి మనం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెడితే అరగంటలోపే ఫుడ్ ఇంటికి వస్తుంది. స్విగ్గీ, జొమోటో వంటి సంస్థలు అన్నిరకాల ఫుడ్ ఐటెమ్స్‌ను మనం ఆర్డర్ చేసుకున్న దానిని బట్టి ఇంటికి పంపిస్తున్నారు. ఈ సేవలు చాలా బాగున్నాయి.
– రాజశేఖర్, సారపాక
Comments
Please login to add a commentAdd a comment