లాయర్లే గూండాలుగా మారినవేళ...
పాటియాలా హౌస్ కోర్టు రణరంగంగా మారిపోయింది. జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంలో అక్కడ పలు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. అక్కడ అందరూ మాట్లాడుకుంటుండగా ఉన్నట్టుండి.. ''జేఎన్‌యూ వాళ్లు వచ్చారు.. వాళ్లను బయటకు తోసేయండి'' అంటూ అరుపులు వినిపించాయి. వెంటనే కొంతమంది న్యాయవాదులు లేచి, కోర్టు హాల్లోంచి జేఎన్‌యూ వాళ్లు వెళ్లిపోవాలని చెప్పారు. అయితే ఎందుకన్నది మాత్రం ఎవరికీ తెలియదు. పరిస్థితి విషమిస్తుండటంతో కొంతమంది జేఎన్‌యూ ప్రొఫెసర్లు అక్కడి నుంచి వెళ్లిపోడానికి సిద్ధమయ్యారు. అంతలోనే కొందరు లాయర్లు వచ్చి, వాళ్లతో గొడవపడ్డారు.
జర్నలిస్టులను కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ లాయర్ దుస్తుల్లో ఉన్న కొంతమంది బెదిరించారు. ఏంటా అని చూసేలోపే పిడిగుద్దులు పడ్డాయి. కొంతమంది జర్నలిస్టులను మరికొందరు న్యాయవాదులు గుర్తించి.. వాళ్లను రక్షించారు. అప్పటికే పరిస్థితి బాగా విషమించింది. కోర్టు బయట నిల్చుని ఉన్న జర్నలిస్టులను కూడా జేఎన్‌యూ విద్యార్థులుగా భావించి వాళ్లను కొందరు లాయర్లు కొట్టారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గదిలో ఉన్న మహిళా రిపోర్టర్లను కూడా అక్కడినుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించారు. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ ఓ జేఎన్‌యూ విద్యార్థిని వెంటపడి తరుముకుంటూ బయటకు తీసుకెళ్లి కొట్టినట్లు కొందరు చెప్పారు. అయితే ఇంత జరుగుతున్నా ఢిల్లీ పోలీసులు మాత్రం మౌన ప్రేక్షకుల్లానే ఉండిపోయారని పలువురు బాధితులు ఆరోపించారు. మరికొందరు లాయర్లు 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు.