
వెంకయ్యకు ఎక్కడి నుంచి?
వచ్చే జూన్‌లో రాజ్యసభ పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు ఈసారి ఎక్కడి నుంచి అవకాశం దక్కుతుందన్నది బీజేపీ వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే మూడు దఫాలుగా రాజ్యసభకు అవకాశం దక్కిన వెంకయ్య నాయుడుకు ఈసారి మరో అవకాశం కల్పిస్తారా. కల్పిస్తే ఏ రాష్ట్రం నుంచి అనే చర్చ మొదలైంది.
ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకయ్యనాయుడు పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 57 రాజ్యసభ స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలు విడుదల చేసింది. తాజా షెడ్యూలు మేరకు జూన్ 11 న ఎన్నికలు నిర్వహించనున్నారు.
కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్యకు ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం కల్పిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం మిత్రపక్షమైన టీడీపీ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె పదవీకాలం కూడా జూన్ నెలాఖరుతోనే ముగుస్తోంది. పైగా రాజ్యసభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆమెకు అవకాశం లభించగా, ఆమె ఆ పదవిలో రెండేళ్లు మాత్రమే ఉన్నారు. ఆ కారణంగా ఏపీ నుంచి మరోసారి అవకాశం కల్పించాలంటే బీజేపీ జాతీయ నాయకత్వం కచ్చితంగా నిర్మలా సీతారామన్‌కు అవకాశం ఇస్తారని చెబుతున్నారు.
టీడీపీ తన మిత్రపమైన బీజేపీకి ఒక స్థానమే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఒక్క స్థానంలో నిర్మలా సీతారామన్‌కే మరోసారి అవకాశం కల్పిస్తారు. ఆమెను ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి మార్చి ఇక్కడినుంచి వెంకయ్యనాయుడికి ఇచ్చే అవకాశాలు లేవు.
ఇకపోతే, కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకయ్యనాయుడితో పాటు అయనూర్ మంజునాథ్ పదవీకాలం కూడా ముగుస్తోంది. అయితే కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరిగణనలోకి తీసుకుంటే ఆ పార్టీ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలదు.
కర్ణాటక శాసనసభలో 225 మంది శాసనసభ్యుల్లో కాంగ్రెస్ (123), బీజేపీ (44), జేడీ (ఎస్) 40, కేజేపీ (2), ఎస్కేపీ (1), స్వతంత్రులు (9), నామినేటెడ్ (1) ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వెంకయ్య నాయుడుతో పాటు ఆ పార్టీకే చెందిన మంజునాధ్, కాంగ్రెస్‌కు చెందిన ఆస్కార్ ఫెర్నాండెజ్, ఇటీవలే దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యా (గతంలో జేడీఎస్ మద్దతుతో ఇండిపెండెంట్ గా గెలిచారు) ఇప్పుడు రిటైరవుతున్నారు. శాసనసభలో ఉన్న బలాబలాల మేరకు బీజేపీకి ఒక రాజ్యసభ స్థానం మాత్రమే దక్కే అవకాశాలున్నాయి.
గతంలో బీజేపీ నుంచి బహిష్కృతుడైన బీఎస్ యడ్యూరప్పను ఇటీవలే మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. అంటే 2018లో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని యడ్యూరప్పను పార్టీలో చేర్పించుకున్నట్టు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవుతున్న పరిస్థితుల్లో కర్ణాటక నుంచి ఈసారి రాజ్యసభకు స్థానికుడినే ఎంపిక చేయాలని ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు పట్టుబడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి గానీ అటు కర్ణాటక నుంచి గానీ వెంకయ్యనాయుడికి అవకాశం ఉండకపోవచ్చని బీజేపీలోని ఒక వర్గం విశ్లేషిస్తోంది. అయితే జాతీయ నాయకత్వంతో ఆయనకు ఉన్న సంబంధాల కారణంగా తిరిగి కర్ణాటక నుంచే రాజ్యసభకు పోటీచేస్తారని అగ్రనాయకులు చెబుతున్నారు. బీజేపీ తరఫున ఇప్పటికే మూడు సార్లు రాజ్యసభకు అవకాశం దక్కిన వెంకయ్యకు మరోసారి అవకాశం కల్పిస్తారా అన్న అంశంపైన కూడా చర్చ సాగుతోంది.
ప్రత్యేక పరిస్థితుల్లో మినగా పార్టీ తరఫున మూడుసార్లకు మించి రాజ్యసభకు అవకాశం ఇవ్వరాదన్నది పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రితో ఉన్న సంబంధాల రీత్యా వెంకయ్యనాయుడుకు నాలుగోసారి అవకాశం ఇప్పటికే ఖాయమైందని ఆ పార్టీ జాతీయ నాయకుడొకరు చెప్పారు. మరో రాష్ట్రానికి మార్చడం వల్ల కొన్ని ఇబ్బందులొస్తాయని, ఈసారి కూడా కర్ణాటక నుంచే నామినేషన్ వేస్తారని ఆయన పేర్కొన్నారు. నామినేషన్లకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నందున దేశవ్యాప్తంగా ఖాళీ అయిన స్థానాల్లో ఎక్కడెక్కడ గెలవగలుగుతాం... ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయం కొద్దిరోజుల్లో జాతీయ నాయకత్వం సమావేశమై నిర్ణయిస్తుందని వివరించారు.