స్టింగ్ ఎఫెక్ట్: అజ్ఞాతంలోకి ఎమ్మెల్యేలు!
న్యూఢిల్లీ/బెంగళూరు/ముంబై: కర్ణాటకలో రాజ్యసభ సభ్యుల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. 'రూ. 10 కోట్లు లంచంగా ఇస్తే క్రాస్ ఓటింగ్ చేస్తామంటూ' స్టింగ్ ఆపరేషన్ లో ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యేలతోపాటు మొత్తం 14 మంది స్వతంత్ర శాసనసభ్యులు సోమవారం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
మరోవైపు షెడ్యూల్ ప్రకారమే కర్ణాటకలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. స్టింగ్ వ్యవహారం లైకైన తర్వాత ఎన్నికలు వాయిదా వేయాలని ప్రతిపక్ష జేడీఎస్ ఈసీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
కాగా, స్టింగ్ ఆపరేషన్ వీడియోల్లో బేరసారాలాడుతూ దొరికిపోయిన ఎమ్మెల్యేలను కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ వెనకేసుకొచ్చారు. వీడియోల్లో ఎలాంటి ఆధారాలు లేవని, ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరమేలేదని అన్నారు. కొందరు కీలకనేతలతో కలిసి సోమవారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్ లోగల ఎన్నికల సంఘాన్ని కలిశారాయన.
ముంబైకి ఎమ్మెల్యేల తరలింపు
ఇటు అధికార కాంగ్రెస్ కు గానీ, అటు ప్రతిపక్ష జేడీఎస్ కుగానీ అదనపు స్థానం గెలుచుకోవడంలో కీలకంగా మారిన 14 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ముంబైకి తరలించింది. వారందరిని కమ్యూనికేషన్ కు దూరంగా ఓ అజ్ఞాత ప్రదేశంలో ఉంచినట్లు సమాచారం.
ఒక్క సీటు కోసం 'కోట్ల' పాట్లు:225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కు 123 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. జేడీఎస్ కు 40 మంది ఎమ్మెల్యేలున్నారు. మెజారిటీని బట్టి కాంగ్రెస్ కు రెండు రాజ్యసభ సీట్లు గెలుచుకోవడం ఖాయం. మూడో స్థానంలో గెలుపు కోసం 12 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం, అదే జేడీఎస్ ఒక స్థానాన్ని గెలుచుకోవాలంటే ఐదుగరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను ప్రలోభాలతో ముంచెత్తారు. ఆ బేరసారాలకు సబంధించిన వ్యవహారాలను రండు టీవీ చానెల్స్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టడంతో ప్రలోభాల పర్వం గుట్టురట్టైంది.