జస్టిస్ కర్ణన్ ఎక్కడ?
► తడ ప్రాంతంలో ఉన్నట్లు జీపీఎస్ సమాచారం
► శ్రీకాళహస్తికి రాబోతున్నట్లూ వార్తలు..
చెన్నై/తడ/శ్రీకాళహస్తి: కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు ఆర్నెల్ల జైలు శిక్ష విధించిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ఆచూకీపై మిస్టరీ నెలకొంది. అరెస్టును తప్పించుకునేం దుకు ఆయన చెన్నై నుంచి నెల్లూరు జిల్లా తడకు వచ్చారని ఒకపక్క, పూజల కోసం శ్రీకాళహస్తికి చేరుకుంటున్నారని మరోపక్క బుధవారం వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు ఆ ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. జస్టిస్ కర్ణన్ కోసం గాలిస్తున్న కోల్‌కతా పోలీసులు ఆయన తడ ప్రాంతానికి వచ్చినట్లు జీపీఎస్, డ్రైవర్ ఫోన్ నంబర్ ఆధారంగా గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
జడ్జి కారు సరిహద్దు గ్రామమైన పన్నంగాడు వద్ద ఉన్నట్లు సిగ్నల్ చూపడంతో ఎస్‌ఐ సురేష్ బాబు వెంటనే అక్కడ గాలించారు. కానీ అక్కడ ఎలాంటి ఆచూకీ లభించలేదు. తడలోని సీసీ కెమెరాలను పరిశీలించినా ప్రయోజనం లేకపోయింది. కోల్‌కతా, చెన్నై పోలీసులు, మీడియా ప్రతినిధు లు కూడా తడ పోలీస్ స్టేషన్‌కి చేరుకుని వివరాలు సేకరించారు. మరోపక్క.. తరచూ శ్రీకాళహస్తికి వచ్చే జస్టిస్ కర్ణన్ బుధవారం చెన్నై నుంచి శ్రీకాళహస్తి దేవస్థానా నికి వస్తున్నారని, సాయంత్రం రాహుకేతు పూజ చేస్తారని వార్తలొచ్చాయి. చెన్నైలోని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేసిన కర్ణన్ అధికారికంగా అక్కడి నుంచి ఖాళీ చేయలేదు.