జస్టిస్ కర్ణన్‌కు ఆర్నెల్ల జైలు
కోర్టుధిక్కార నేరం కింద శిక్ష విధించిన సుప్రీంకోర్టు
► తక్షణం తీర్పు అమలు చేయాలని ఆదేశం..
► న్యాయమూర్తుల పరిరక్షణ చట్టం, సెక్షన్– 3 కర్ణన్‌కు వర్తించదు: న్యాయనిపుణులు
న్యూఢిల్లీ, చెన్నై: కలకత్తా హైకోర్టుకు చెందిన వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కార నేరం కింద ఆర్నెల్లు జైలుశిక్ష విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ‘జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారానికి పాల్పడటంతో పాటు న్యాయవ్యవస్థను, న్యాయపక్రియను ధిక్కరించినందున ఆయనకు శిక్ష విధించాలని ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్మానించింది.
తీర్పు తక్షణం అమలు చేసేందుకు ఆయన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలి’ అని ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ కర్ణన్ జారీచేసే తదుపరి ఆదేశాలను ప్రచురించొద్దని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జె చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ కురియన్ జోసఫ్‌ల ధర్మాసనం మీడియాకు ఆదేశాలు జారీచేసింది. కాగా తనపై విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనంలోని సభ్యులకు సోమవారం తన ఇంట్లోనే విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద ఐదేళ్ల చొప్పున కారాగార శిక్ష విధిస్తూ జస్టిస్ కర్ణన్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
వివాదాస్పద ప్రవర్తన కారణంగా మద్రాస్ హైకోర్టులో పనిచేస్తున్న కర్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే ఆ ఆదేశాలను కర్ణన్ ధిక్కరించడంతో ఆయనకు ఎటువంటి విధులూ అప్పగించొద్దని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. తమ ఆదేశాలు పాటించనందుకు కోర్టు ధిక్కరణకేసులో తమ ముందు హాజరుకావాలంటూ మార్చి 10న సుప్రీంకోర్టు జస్టిస్ కర్ణన్‌కు బెయిలబుల్ వారంట్ జారీచేసింది.
ఆయన హాజరు కాకపోవడంతో నెల తరువాత తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ మరో నోటీసు జారీచేసింది. మార్చి 31న సుప్రీంకోర్టుకు హాజరైన జస్టిస్ కర్ణన్ తన అధికారాలను పునరుద్ధరించాలని కోరగా అందుకు కోర్టు తిరస్కరించింది. దీంతో తనను జైల్లో పెట్టినా సరే మరోమారు బెంచ్ ముందు హాజరుకానని ఆయన స్పష్టం చేశారు. దీంతో అతని మానసిక స్థితిపై పోలీసుల సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించాలని ధర్మాసనం మే 1న ఆదేశాలు జారీచేసింది. అయితే మే 4న జస్టిస్ కర్ణన్ వైద్యపరీక్షలు చేయించుకోవడానికి తిరస్కరిస్తూ తను మానసికంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటూ లేఖ ఇచ్చారు.
చెన్నైకి జస్టిస్ కర్ణన్: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్ మంగళవారం చెన్నైకి వచ్చారు. తనకు ఆర్నెల్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడానికి ముందు నగరానికి చేరుకున్న ఆయన స్టేట్ గెస్ట్‌హౌస్‌లో విడిది చేశారు. మధ్యాహ్నం తన గదిలో విలేకర్లతో మాట్లాడారు.
పదవిలో ఉన్న న్యాయమూర్తిని శిక్షించవచ్చా?
భారతదేశ ఉన్నత న్యాయస్థానాల చరిత్రలో పదవిలో కొనసాగుతూ శిక్ష ఎదుర్కోనున్న మొట్టమొదటి న్యాయమూర్తిగా జస్టిస్ సీఎస్ కర్ణన్ చరిత్రలో నిలిచిపోనున్నారు. అలాగే తాను చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపకుండా న్యాయవ్యవస్థలో కల్లోలం రేపిన న్యాయమూర్తిగా కూడా ఆయన అపఖ్యాతి మూటకట్టుకున్నారు. అయితే అసలు పదవిలో ఉన్న న్యాయమూర్తికి శిక్ష విధించవచ్చా..? ‘న్యాయమూర్తుల పరిరక్షణ చట్టం–1985 సెక్షన్ 3 ప్రకారం... న్యాయ, పరిపాలనా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు న్యాయమూర్తులపై ఎలాంటి సివిల్ లేదా క్రిమినల్ చర్యలు చేపట్టకుండా ప్రత్యేక్ష రక్షణ కల్పించారు. అయితే జస్టిస్ కర్ణన్‌ను న్యాయ, పరిపాలన విధుల నుంచి తప్పిస్తూ ఇంతకుముందే సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
ఈ నేపథ్యంలో కర్ణన్‌ను దోషిగా నిర్ధారించేందుకు మార్గం సుగమమైంది. న్యాయమూర్తుల పరిరక్షణ చట్టం–1985 సెక్షన్ 3 కింద కర్ణన్‌కు ఎలాంటి రాజ్యాంగ రక్షణ లేదని సుప్రీంకోర్టు న్యాయవాది అతుల్ కుమార్ పేర్కొన్నారు. ఒక హైకోర్టు న్యాయమూర్తికి కోర్టు ధిక్కరణ నేరం కింద ఆరు నెలల జైలు శిక్ష విధించడం భారత దేశ చరిత్రలో ఇదే మొదటిసారని, అందుకోసం సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సాయం తీసుకుందని చెప్పారు. న్యాయవ్యవస్థ పరువు–ప్రతిష్టల్ని సుప్రీంకోర్టు తీర్పు కాపాడిందని, మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రత్యేక గౌరవాన్ని కాపాడేందుకు సుప్రీం ఇచ్చిన తీర్పు సరైందని, ఇకముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని అతుల్ పేర్కొన్నారు.
మరో సీనియర్ న్యాయవాది శంతను మాట్లాడుతూ.. ‘నువ్వు హైకోర్టు న్యాయమూర్తైనా సరే సుప్రీం కోర్టును తక్కువ అంచనా వేయకూడదనేందకు ఈ తీర్పు ఒక ఉదాహరణ’ని పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం మర్యాదకు సంబంధించిన సమస్యను సుప్రీంకోర్టే పరిష్కరించిందన్నారు. వక్రమార్గం పట్టిన న్యాయమూర్తుల అనైతిక ప్రవర్తన నుంచి ఉన్నత న్యాయస్థానాల మర్యాద, గౌరవాన్ని రక్షించే క్రమంలో ఈ తీర్పు ఒక విజయమని మరో సీనియర్ న్యాయవాది అవనిశ్ కుమార్ చెప్పారు.
ఆరేళ్లుగా వివాదాలే!
వివాదాల్లో చిక్కుకోవడమేగాక, తోటి న్యాయమూర్తులతో బహిరంగంగా గొడవ పడడం, సుప్రీంకోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేయడం కొందరు హైకోర్టు జడ్జీలకు ఏడెనిమిదేళ్లుగా సాధారణంగా మారింది. ఇక జస్టిస్ కర్ణన్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచీ వివాదాలతోనే ముందుకు సాగారు.
కాలు తగిలించారంటూ సహజడ్జిపై ఆరోపణలు
2009లో మద్రాసు హైకోర్టు అదనపు జడ్జీగా నియామకంతో న్యాయవ్యవస్థలోకి అడుగుపెట్టిన కర్ణన్ ఆరేళ్లుగా ఏదొక వివాదంతో అలజడి రేపుతూనే ఉన్నారు. తన పక్కన కూర్చున్న తోటి జడ్జి కావాలని కాలు తాకించి కుల వివక్ష చూపించారని 2011లో విలేకరుల సమావేశం పెట్టి మరీ కర్ణన్ ఆరోపించారు.
2015లో మద్రాసు హైకోర్టులో న్యాయవ్యవస్థ నియామకాలపై వాదనలు జరుగుతుండగా, కర్ణన్ హఠాత్తుగా అక్కడకు వెళ్లి తన వాదన వినాలంటూ గొడవపడ్డారు. అదే ఏడాది ఏప్రిల్‌లో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌కిషన్ కౌల్‌పై కోర్టుధిక్కార విచారణ ప్రారంభించి సంచలనం సృష్టించారు. దళితుడైనందున కౌల్ తనను వేధించడమేగాక, ప్రాధాన్యం లేని కేసుల్ని అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది.
సుప్రీంకోర్టుపైనే పోరాటం
2016 ఫిబ్రవరిలో జస్టిస్ కౌల్‌పై కర్ణన్ అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో అదే నెలలో సుప్రీంకోర్టు కర్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీచేసింది. వెంటనే సుప్రీం ఉత్తర్వుపై స్టే ఇస్తూ కర్ణన్ ఆదేశాలు జారీచేశారు. ఈ స్టేను ఇద్దరు జడ్జీల సుప్రీం బెంచ్ తొలగించగా, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేయాలని చెన్నై పోలీసులను ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని ప్రకటనలపై ధిక్కార అభియోగం కింద చర్యలు తీసుకుంటానని సుప్రీంకోర్టు హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన కర్ణన్ తనకు ‘మతి స్థిమితం’ తప్పిందంటూ క్షమాపణ చెప్పారు. అప్పటి సుప్రీం ప్రధానన్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌తో ప్రైవేటుగా సమావేశమై.. కలకత్తా హైకోర్టులో జడ్జీగా చేరేందుకు అంగీకరించారు. అంతటితో ఆగకుండా 2017 జనవరిలో పదవిలో ఉన్న, రిటైరైన 20 మంది సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు అవినీతిపరులంటూ జాబితా విడుదల చేసి దుమారం సృష్టించారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానికి లేఖ రాశారు.
గతంలోనూ వివాదాస్పద న్యాయమూర్తులు
2011లో అప్పటి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీడీ దినకరన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల వల్ల అభిశంసన చర్యలు ప్రారంభించగా ఏడాది ముందే ఆయన రాజీనామా చేశారు. 400 ఎకరాల భూమి అక్రమంగా సంపాదించడం, కక్షిదారుల ఇంట్లో బసచేయడం, ఓ హౌసింగ్ సొసైటీలో తన భార్య, కూతుళ్ల పేర్లపై ఇళ్ల స్థలాలు సంపాదించడం వంటి అనేక అభియోగాలు దినకరన్‌పై వచ్చాయి.
2012లో అవినీతి ఆరోపణలతో రాజ్యసభలో అభిశంసన ఎదుర్కొన్న కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సౌమిత్ర సేన్.. తనను తొలగించముందే రాజీనామా చేశారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా తమిళనాడుకు చెందిన సుప్రీంకోర్టు జడ్జీ వి.రామస్వామిపై పార్లమెంటులో అభిశంసన తీర్మానంపై చర్చ జరిగి, ఓటింగ్ జరిగే లోగా ఆయన రాజీనామా చేయడంతో అభిశంసన ప్రక్రియ నిలిపివేశారు.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్