ఇందిరాగాంధీది తప్పా, మోదీది తప్పా?
న్యూఢిల్లీ: దేశంలో నల్లడబ్బును నిర్మూలించేందుకు పెద్ద నోట్లను రద్దు చేయాల్సిందిగా 1970-71 సంవత్సరంలో జస్టిస్ కేఎన్ వాంచూ కమిటీ చేసిన సిఫార్సులను నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అమలు చేసి ఉన్నట్లయితే నేడు తాను రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాల్సిన అవసరం వచ్చేది కాదంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన బీజేపీ ఎంపీల సమావేశంలో తన నిర్ణయాన్ని సమర్థించకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రాజకీయాల కోసం సిఫార్సులను అమలు చేయలేదని, ఆ పార్టీకి దేశానికన్నా పార్టీయే ముఖ్యమని, తనకు పార్టీకన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని కూడా చెప్పుకున్నారు.
నరేంద్ర మోదీ చెప్పిన ఈ మాటల్లో నిజమెంత? నిజంగా నాడే పెద్ద నోట్లను రద్దు చేసినట్లయితే నల్లడబ్బు నిర్మూలన జరిగేదా? అదే జరిగి ఉంటే నేడు మోదీ ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చేదికాదా? అసలు ఆ రోజు నల్లడబ్బు ఎంతుంది? ఉక్కుమహిళగా గుర్తింపుపొందడమే కాకుండా దేశంలోని బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా తొలిసారి ఆర్థిక సంస్కరణలకు తెరతీసిన ఇందిరాగాంధీ ఎందుకు పెద్ద నోట్లను రద్దు చేయలేకపోయారు? నాడున్న పరిస్థితులేమిటీ? నేడున్న పరిస్థితులేమిటీ? వీటికి కచ్చితమైన సమాధానాలు రావాలంటే చరిత్ర పుటలను వెనక్కి తిప్పాల్సిందే.
అసలు మోదీ ఏమన్నారు?...
‘అప్పటి ఆర్థిక మంత్రి వైబీ చవాన్, అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని కలసుకొని పెద్ద నోట్లను రద్దు చేయాల్సిందిగా జస్టిస్ వాంచూ చేసిన సిఫార్సులను ఆమోదించాలని కోరారు. దానికి ఏ...ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకూడదా? అంటూ ఇందిరా గాంధీ ప్రశ్నించారు’ అని మోదీ తెలిపారు. ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వ ఉన్నతాధికారి మాధవ్ గాడ్‌బోల్ ‘అన్‌ఫినిష్డ్ ఇన్నింగ్స్: రీకలెక్షన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్’ అనే పుస్తకంలో పేర్కొన్నారని కూడా మోదీ వివరించారు.
పుస్తకంలో గాడ్‌బోల్ ఏమన్నారు?
అప్పుడు మాధవ్ గాడ్‌బోల్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన రాసిన పుస్తకంలోని ‘మై ఇయర్స్ విత్ వైబీ చవాన్’ అనే చాప్టర్‌లోని ఈ పేరా సారంశాన్ని తీసుకొనే మోదీ ప్రస్తావించారు. ‘వాంచూ కమిటీ సిఫార్సులను ఇందిరాగాంధీ తిరస్కరించినప్పుడు ఆమె మదిలో ఎన్నికల రాజకీయాలే మెదలుతున్నాయి’ అని మాత్రమే మాధవ్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఇందిరాగాంధీ ఏ వ్యాఖ్యలు చేశారో, మాధవ్ వ్యాఖ్యల ఉద్దేశమేమిటో ఆ చాప్టర్‌లో ఎక్కడా వివరించలేదు. మోదీ మాత్రం ఆ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకున్నారు.
ఇంతకు జస్టిస్ వాంచూ ఎవరు?
జస్టిస్ కేఎన్ వాంచూ 1967లో భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఆయన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం 1970లో ప్రత్యక్ష పన్నుల దర్యాప్తు కమిటీ డైరెక్టర్‌గా నియమించారు. దేశంలో నల్లడబ్బు నిర్మూలనకు, పన్నుల వ్యవస్థ విస్తృతి, క్రమబద్ధీకరణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాల్సిందిగా కోరారు. వాంచూ కమిటీ 1970, డిసెంబర్‌లో మధ్యంతర నివేదికను, 1971, డిసెంబర్‌లో తుది నివేదికను సమర్పించారు. అప్పటికీ దేశంలో 1400 కోట్ల రూపాయల నల్ల డబ్బు ఉందని అంచనావేసిన కమిటీ పెద్ద నోట్లను రద్దు చేయాల్సిందిగా సిఫార్సు చేసింది. రాజకీయ పార్టీ విరాళాల్లో ఎక్కువగా నల్లడబ్బు ఉంటోందని, ముందుగా రాజకీయ పార్టీల విరాళాలను క్రమబద్ధీకరించడమే కాకుండా వాటిపై పన్ను విధించాలని, పన్నులను తగ్గించాలని కమిటీ సిఫార్సులు చేసింది.
ఇందిరాంధీ ఎందుకు ఒప్పుకోలేదు?
1970-71 సంవత్సరమంటే బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్‌తో యుద్ధానికి భారత్ సన్నద్ధమవుతున్న రోజులు. అప్పటికే 1962లో చైనాతోని, 1965లో పాకిస్తాన్‌తోని భారత్ యుద్ధం చేయడం వల్ల ఆర్థికంగా ఎంతో దెబ్బతిని ఉంది. దేశంలో దారిద్య్రం, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. అప్పటికే దేశంలోని బ్యాంకులను జాతీయం చేస్తూ ఇందిర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితాలు వెలువడాల్సి ఉంది. 1969లో 14 బ్యాంకులను, 1970లో మరో ఆరు బ్యాంకులను ఆమె ప్రభుత్వం జాతీయం చేసింది. ఇక నల్లడబ్బును నిర్మూలించేందుకు వాంచూ కమిటీ సిఫార్సుల మేరకే 1975లో స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రకటించారు. ఆమె కఠినంగా వ్యవహరిస్తారని బయపడిన వ్యాపారులు 746 కోట్ల రూపాయలను బయటపెట్టారు. అంటే...అంచనా వేసిన మొత్తం నల్లడబ్బులో సగానికన్నా కొంచెం ఎక్కువ.
మోదీ కూడా సాహసించేవారు కాదు
నాటి తీవ్ర విపత్కర పరిస్థితుల్లో ఇందిరాగాంధీయే కాదు నేటి ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నా పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునేందుకు సాహసించేవారు కాదు. పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ వాంచూ చేసిన సిఫార్సులను ప్రస్తావించిన మోదీగారు ముందుగా రాజకీయ పార్టీల విరాళాలను ప్రక్షాలించాలనే సిఫార్సను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదో?