యూపీలో ఎస్పీ–కాంగ్రెస్ పొత్తు ఎవరికి ప్రయోజనం?
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ పోరులో అతి పెద్ద సమరాంగణం ఉత్తర్‌ప్రదేశ్‌లో పాలకపక్షం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పొత్తు సంచలనం సృష్టిస్తోంది. వృద్ధ లోహియా సోషలిస్ట్ నేత ములాయంసింగ్ స్థాపించిన ఎస్పీ తన 24 ఏళ్ల చరిత్రలో తొలిసారి కాంగ్రెస్‌తో కలిసి యూపీ శాసనసభ ఎన్నికల్లో పోటీచేస్తోంది. రాష్ట్రంలో బలమైన రెండు పక్షాల్లో ఒకదానితో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్‌కు ఇది రెండోసారి. ఇప్పటి పొత్తు బీజేపీని ఎంత వరకు అధికారంలోకి రాకుండా అడ్డుకుని, విజయం సాధిస్తుందనే విషయం చర్చనీయాంశమైంది. ఎస్పీతో ఏ పార్టీ అయినా విలీనం కావచ్చుగాని, దేనితో పొత్తు ఉండదని డిసెంబర్ వరకూ ములాయం చెబుతూ వచ్చారు. ములాయం కొడుకు, ముఖ్యమంత్రి అఖేలేశ్ యాదవ్ పార్టీ అంతర్గత పోరాటంలో విజయం సాధించి, పార్టీపై పట్టు సాధించడంతో ఈ పొత్తు సాధ్యమైంది. 1999లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రధాని కాకుండా ములాయం అడ్డుకున్నప్పటి నుంచీ రెండు పార్టీలూ దాదాపు శత్రుపక్షాలుగానే ఉన్నాయి.
2003–07 మధ్య కాలంలో ఈ రెండు పార్టీల మధ్య పొడిచిన స్నేహం చివరికి తీవ్ర ద్వేషభావంతో ముగిసింది. 2008లో భారత–అమెరికా అణు ఒప్పందానికి నిరసనగా అప్పటి యూపీఏ సర్కారుకు వామపక్షాలు మద్దతు ఉపసంహరించినప్పుడు తాత్కాలికంగా మన్మోహన్‌సింగ్ ప్రభుత్వాన్ని ఎస్పీ నిలబెట్టింది. ఈ మైత్రి కూడా మూన్నాళ్ల ముచ్చటే అయింది. 2009, 2014 లోక్‌సభ ఎన్నికలు, 2007, 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు ‘సెక్యులర్’ పార్టీల మధ్య ఎలాంటి అవగాహన లేదు. 2009 ఫిరోజాబాద్ ఉప ఎన్నికలో ములాయం పెద్ద కోడలు డింపుల్‌ను ప్రస్తుత యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ ఓడించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంకా వాడ్రా బీఎస్పీ, ఎస్పీలు రెంటినీ శత్రుపక్షాలుగానే చిత్రించారు. ఎస్పీ నేతలను గూండాలుగా రాహుల్ అభివర్ణించారు.
ఈ ఎన్నికలకు మూడు నెలల ముందు కాంగ్రెస్‌ది ఒంటరి పోరు. ఎన్నికల్లో గెలుపునకు బ్రాహ్మణ నేతను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న ఎన్నికల కన్సల్టెంట్, ఐప్యాక్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ సలహా పాటించి ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను కాబోయే ముఖ్యమంత్రిగా కూడా ఎంపికచేసింది. ఎంత చేసినా యూపీలో వచ్చేది పాతిక సీట్ల లోపేననే అంచనాలు, పది లోపు స్థానాలేనని ఎన్నికల సర్వేల జోస్యాల కారణంగా ఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కిందటి అక్టోబర్ నుంచి సమాజ్‌వాదీ యాదవ పరివారంలో మొదలైన ముసలంలో అఖిలేశ్ విజయం కాంగ్రెస్ ఎత్తుగడకు అనుకూలంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి యూపీలో ఉనికి కాపాడుకోవడానికి ఎస్పీతో పొత్తు తప్పదనే అంచనాతో మూడు నాలుగు రోజుల ఉత్కంఠ తర్వాత 105 సీట్లలో పోటీకి కాంగ్రెస్ అంగీకరించింది.
ఎస్పీ–కాంగ్రెస్ పొత్తులో కీలక పాత్రదారులు డింపుల్, ప్రియాంక!
మొత్తం 403 సీట్ల పంపిణీలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోయి, ఒప్పందం కుదరడానికి అఖిలేశ్ భార్య, కనౌజ్ ఎంపీ డింపుల్, ప్రియాంక ముఖ్య పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. ప్రియాంక ఫోన్ కాల్‌కు స్పందించని ఎస్పీ సీఎం మొబైల్‌ను స్విచాఫ్ చేస్తే, డింపుల్‌కు ప్రియంక ఫోన్ చేశారని, అప్పుడు అఖిలేశ్ ఆమెతో మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ స్థాయిలో ఇద్దరు ప్రముఖ మహిళలకు మంచి ప్రచారం లభించింది. ఈ ఇద్దరి మధ్య విరిసిన స్నేహం ఎస్పీ–కాంగ్రెస్ కూటమిని విజయపథంలో నడిపిస్తుందని రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు ఆశిస్తున్నారు. గతంలో అన్న, అమ్మ లోక్‌సభ సీట్లు రాయ్‌బరేలీ, అమేఠీకే పరిమితమైన ప్రియాంక ఈసారి రాష్ట్రమంతా కాంగ్రెస్ తరఫున, కుదిరితే డింపుల్‌తో కలిసి కూటమి తరఫున సుడిగాలి ప్రచారం చేస్తారని వార్తలొస్తున్నాయి.
1993 ఎస్పీ–బీఎస్పీ పొత్తు పాక్షిక విజయం
1993 యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటి ఎస్పీ– బహుజన్‌సమాజ్ పార్టీ(బీఎస్పీ) పొత్తు కొంత మేరకు విజయం సాధించిపెట్టింది. 1992 బాబ్రీమసీదు విధ్వంసం తర్వాత జరిగిన ఎన్నికలివి. బీఎస్పీ అధ్యక్షుడు కాన్షీరాం, ములాయం మధ్య కుదిరిన ఎన్నికల పొత్తు ఈ కూటమికి 176 సీట్లు తెచ్చిపెట్టింది. మెజారిటీకి 213 సీట్లు(ఉత్తరాఖండ్ ఏర్పాటుకు ముందు మొత్తం 424 సీట్లు) అవసరం కాగా జనతాదళ్(27), కాంగ్రెస్(28), వామపక్షాల(4) మద్దతుతో ఎస్పీ, బీఎస్పీలు కలిసి ములాయం యాదవ్ నేతృత్వంలో తొలి, చివరి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి. ములాయం, మయావతి మధ్య విభేదాలతో ఈ ప్రభుత్వం ఏడాదిన్నరకే 1995 జూన్‌లో కూలిపోయింది.
1996 బీఎస్పీ–కాంగ్రెస్ పొత్తుకు నూరు సీట్లు!
1996 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయాక అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు పి.వి.నరసింహారావు బీఎస్పీ నేత కాన్షీరాంతో మాట్లాడి అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నారు. రాష్ట్రాన్ని కొన్ని దశాబ్దాల పాటు పాలించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తన 110 ఏళ్ల చరిత్రలో తొలిసారి జూనియర్ భాగస్వామిగా దళితుల నేతృత్వంలోని బీఎస్పీ నాయకత్వాన్ని అంగీకరించింది. బీఎస్పీ 296, కాంగ్రెస్ 126 సీట్లకు పోటీచేసి, వరుసగా 67, 33 సీట్లను మాత్రమే సాధించాయి. బీజేపీ 174 సీట్లతో మొదటి స్థానంలో నిలిచింది. 110 సీట్లతో ఎస్పీ రెండో స్థానం సంపాదించింది. బీఎస్పీ పోటీచేయని స్థానాల్లో ఈపార్టీ ఓటర్లైన బహుజనులు(ఎస్సీలు, బీసీలు) కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేశారు. బీఎస్పీ పోటీచేసిన చోట్ల మాత్రం కాంగ్రెస్ మద్దతుదారులైన బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల వారు బీఎస్పీకి ఓటేయలేదని ఫలితాలు వచ్చాక కాన్షీరాం వివరించారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుపెట్టుకున్న బీఎస్పీ చివరికి బీజేపీ మద్దతుతో మాయావతిని రెండోసారి ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోబెట్టింది. ఇలా రెండోసారి ఎన్నికల ముందు కుదిరిన ‘లౌకికపక్షాల’ స్నేహం విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత కాంగ్రెస్‌తో బీఎస్పీ ఏనాడూ ఎన్నికల పొత్తు పెట్టుకోలేదు.
27 సాల్ బురా హాల్ నినాదం ఇచ్చాక ఎస్పీతో పొత్తు ఎందుకు?
1989 డిసెంబర్‌లో యూపీలో ప్రతిపక్షస్థానానికి పరిమితమైన కాంగ్రెస్ అప్పటి నుంచీ అక్కడే నిలబడిపోయింది. అందుకే ఈ 27 ఏళ్లలో యూపీ అధ్వాన్న పరిస్థితికి చేరుకుందంటూ నాలుగు నెలల క్రితం ‘27 సాల్ బురా హాల్’ నినాదం ఇచ్చింది. కిందటి అక్టోబర్‌లో యూపీలోని 48 జిల్లాల్లోని 141 అసెంబ్లీ స్థానాల్లో3,500 కిలోమీటర్ల కిసాన్ యాత్ర ముగించుకు వచ్చిన రాహుల్‌కు పరిస్థితి అర్ధమైంది. ఒంటరి పోరులో ఉన్న 28 సీట్లు నిలబెట్టుకోలేమని తెలిసొచ్చింది. అప్పటి నుంచీ ఎస్పీ సర్కారుపై ఆయన విమర్శల్లో వాడి, వేడి తగ్గడం మొదలైంది. ఎస్పీతో పొత్తుకు అఖిలేశ్‌తో మాట్లాడే పని పంజాబ్‌లో ఉన్న ప్రశాంత్ కిశోర్‌కు రాహుల్ అప్పగించారు. కాంగ్రెస్ వ్యతిరేకతే ప్రధాన సిద్ధాంతంగా, వ్యూహంగా వాడుకుని రాజకీయ లబ్ధి పొందిన ములాయం ‘మూలన’పడడంతో రాహుల్ ఎత్తుగడ ఫలించింది.
పొత్తు విజయం సాధించేనా?
యూపీలో కాంగ్రెస్ దాదాపు 40 ఏళ్లు పాలన సాగించింది. దళితులు, ముస్లింలు, యాదవుల తర్వాత అధిక జనాభా ఉన్న బ్రాహ్మణ వర్గానికి చెందిన అయిదుగురు నేతలు సీఎంలు కావడానికి కూడా అవకాశం ఇచ్చింది. అయితే, ఈ వర్గంతోపాటు మిగిలిన అగ్రవర్ణాలు, ముస్లింలు, దళితులు ఈ పార్టీకి దూరమయ్యారు. మండల్–మసీదు ఆందోళనల ఫలితంగా 1989 నుంచీ అసెంబ్లీలో పార్టీ బలం పడిపోతూ వచ్చింది.(1989లో 94, 91లో 46, 93లో 27, 96లో 33, 2002లో 25, 2007లో 22 సీట్లు) బ్రాహ్మణులు, ముస్లింలు, దళితులు –ఇలా అన్ని ప్రధాన వర్గాల అత్యధిక ఓట్లు బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ వైపు తరలిపోయాయి. తొలుత స్నేహ హస్తం అందించినా ఎన్నికల ముందు కాంగ్రెస్‌తో పొత్తుకు బీఎస్పీ నాయకురాలు మాయావతి తిరస్కరించారు.
దాంతో అఖిలేశ్, డింపుల్, రాహుల్, ప్రియాంక రూపంలోని యువ ముఖాలు ముందు పెట్టి బీజేపీతో తలపడడం మేలని అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం భావించి చివరి నిమిషంలో పొత్తును కాపాడారు. బీజేపీపై వ్యతిరేకత మినహా ఎలాంటి సైద్ధాంతిక సారూప్యం లేని ఈ రెంటి కలయిక వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని కొందరు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌కు ఇంకా మద్దతిస్తున్న దళితులు పార్టీ అభ్యర్థులు లేని స్థానాల్లో బీఎస్పీకి ఓటేస్తారని, బ్రాహ్మణులు బీజేపీ లేదా బీఎస్పీకి మద్దతు పలుకుతారని వారు అంటున్నారు. అయితే, ఎస్పీకి విధేయులైన ముస్లింలు, బీసీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తారని, ఈ పొత్తు ఎస్పీ కన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ ప్రయోజనకరమని కూడా వారు విశ్లేషిస్తున్నారు. అదీగాక ఎస్పీ ఈ అనవసర పొత్తు వల్ల కాంగ్రెస్‌కు మూడు దశాబ్దాలుగా దూరమైన ముస్లింలను చే జేతులా అప్పగించి నష్టపోతుందని కొందరు ఎన్నికల విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అయితే, 2014 నాటి నరేంద్ర మోదీ హవా లేని ప్రస్తుత పరిస్థితుల్లో యూపీలో ఎన్నికల సమరాన్ని చతుర్మఖ పోటీల నుంచి త్రిముఖ పోటీలకు పరిమితం చేస్తే బీజేపీ మెజారిటీ సాధించలేదని, ఎస్పీ–కాంగ్రెస్ పొత్తుకు ఈసారి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని కొందరు గట్టిగా నమ్ముతున్నారు. వారసత్వ రాజకీయాలకు పునాదిగా మారిన యూపీలో నలుగురు కొత్త తరం నేతలను రంగంలోకి దింపి చేస్తున్న ఈ పొత్తు ప్రయోగం భవిష్యత్తులో బీజేపీ వ్యతిరేక లౌకిక కూటమి ఏర్పాటుకు ఉపకరిస్తుందని కూడా భావిస్తున్నారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)