ఛండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య సీట్ల సర్దుబాటుకు చర్చలు కొనసాగుతున్నాయి. పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
నేటి సాయంత్రంలోగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుపై తమకు పార్టీ అధిష్టానం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం రాలేదన్న ఆయన.. సోమవారం 90 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు హర్యానా ఆప్ యూనిట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
‘ఆప్ హర్యానా చీఫ్‌గా నేను 90 అసెంబ్లీ స్థానాలకు పోటీకి సిద్ధమవుతున్నాను. పొత్తు గురించి పార్టీ హైకమాండ్ నుంచి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈరోజు నిర్ణయం రాకపోతే, సాయంత్రంలోగా మొత్తం 90 స్థానాలకు మా జాబితాను విడుదల చేస్తాం’ అని గుప్తా తెలిపారు.
కాగా హర్యాలో పోటీకి ఆప్ పూర్తిగా సిద్దంగా ఉందని పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొలిక్కివచ్చిందని, పార్టీ కేంద్ర నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన అనంతరం అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తుపై కొనసాగుతున్న తరుణంలో.. పార్టీ తరపున చర్చలకు నాయకత్వం వహిస్తున్న ఆప్ ఎంపీ రాఘవ్ మాట్లాడుతూ.. పొత్తుపై సానుకూల ఫలితం వస్తుందని తాను ఆశిస్తున్నానని తెలిపారు. ఇరు పార్టీలకు ప్రయోజనం కలిగించేలా పొత్తు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు
అక్టోబర్ 5న జరిగే హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించాయని పలువురు చెబుతున్నా కార్యాచరణలో అది సాధ్యమయ్యేలా లేదని సమాచారం. కొన్ని సీట్లపై ఆప్ పట్టుబడుతుండటంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని తెలుస్తోంది. 20 స్ధానాలు కావాలని ఆప్ డిమాండ్ చేస్తుండగా సింగిల్ డిజిట్ స్ధానాలనే కాంగ్రెస్ ఆఫర్ చేస్తుండటంతో చర్చలు ఓ కొలిక్కిరావడం లేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment