ఆప్‌కు కాంగ్రెస్ చురకలు | Congress Support In Liquor Case And Soft Dig At AAP | Sakshi
Sakshi News home page

ఆప్‌కు కాంగ్రెస్ చురకలు

Published Fri, Oct 6 2023 10:57 AM | Last Updated on Fri, Oct 6 2023 11:52 AM

Congress Support In Liquor Case And Soft Dig At AAP  - Sakshi

ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మద్దతునిస్తూనే ఆప్‌కు కాంగ్రెస్ చురకలంటించింది. ఇండియా కూటమి భాగస్వామైన ఆప్‌ను కాపాడుకుంటూనే పంజాబ్‌లో తమ నేతలను అరెస్టు చేయడంపై విరుచుకుపడింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టుపై స్పందించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.. బీజేపీ ప్రతికార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.  

దేశంలో దర్యాప్తు సంస్థలు రాజకీయ లక్ష‍్యాల కోసం పనిచేస్తున్నాయని కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. బీజేపీ ప్రతికార రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని అన్నారు. అదే క్రమంలో తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంపై ఆప్‌ను నిందించారు. 

పంజాబ్‌లో 2015నాటి డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరాను పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మఖ్యమంత్రి ఓపీ సోనీని కూడా అరెస్టు చేశారు. పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉన్న నేపథ్యంలో తమ నేతలను అరెస్టు చేయడం పట్ల కేసీ వేణుగోపాల్ ‍అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నేతల అరెస్టులు న్యాయబద్ధంగా జరలేదని ఆరోపించారు. 

కూటమిలో పోరు:
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్‌కు మద్యం కుంభకోణం కేసులో మద్దతుగా నిలుస్తోంది. అటు.. పంజాబ్‌లో సొంత అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లో ఆప్‌, కాంగ్రెస్‌కు మధ్య సీట్ల షేరింగ్‌లోనూ వివాదాలు కొనసాగుతున్నాయి. అవినీతి మయమైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆప్ నేతలు అంటున్నారు. కూటమిలో ఆప్ భాగస్వామిగా ఉంటుందని పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఢిల్లీ మధ్యం కుంభకోణం:
మద్యం కుంభకోణంలో అక్రమాలకు పాల్పడి ఆ డబ్బును పార్టీ ప్రచారాల కోసం వినియోగించారని ఈడీ ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే జైలు పాలయ్యారు. తాజాగా మరో ఆప్ నేత సంజయ్ సింగ్‌ను కూడా అరెస్టు చేశారు పోలీసులు.

ఇదీ చదవండి: వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా?


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement