
దళితుల ఇంట్లో అమిత్ షా లంచ్ ఎందుకు?
వారణాసి: ఉత్తరప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలని బీజేపీ గట్టిగానే తలపిస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా మెల్లగా అన్ని వర్గాలను ఆకట్టుకునే పనిలో పడింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అధికారం దక్కించుకుంటే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తమ ప్రభావం బలంగా చూపించవచ్చన్న తలంపుతో ముందుకు వెళుతోంది.
ఇందుకు అనుగుణంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు రచిస్తునే ఉన్నారు. మంగళవారం ప్రధాని నరంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్న ఆయన మధ్యాహ్నం ఓ దళితుల ఇంట్లో భోజనం చేయనున్నారు. అలహా బాద్ నుంచి వారణాసి విమానాశ్రాయానికి వెళ్లే మార్గంలో సేవాపురి అనే గ్రామంలో గిరిజాప్రసాద్ బింద్, ఇక్బాల్ బింద్ అనే దళిత దంపతుల ఇంట్లో ఆయన లంచ్ చేయనున్నట్లు యూపీ బీజేపీ మీడియా ఇంఛార్జీ సంజయ్ భరద్వాజ్ చెప్పారు. దీంతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.