నామినేషన్ వేసేందుకు వస్తున్న మోదీ
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీతోపాటు ఎన్‌డీఏ పక్షాల ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గురువారమే ఇక్కడికి చేరుకున్న మోదీ.. శుక్రవారం ఉదయం బూత్‌స్థాయి నేతలు, కార్యకర్తలతో సమావేశమై, ఆపై కాలభైరవుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు బయలుదేరారు.
ఆయన వెంట అధికార ఎన్‌డీఏ పక్షానికి చెందిన బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్, ఎల్‌జేపీ చీఫ్ రాం విలాస్ పాశ్వాన్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరే, శిరోమణి అకాలీదళ్ చీఫ్ ప్రకాశ్ సింగ్ బాదల్‌తోపాటు బీజేపీ చీఫ్ అమిత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, సుష్మా స్వరాజ్ ఉన్నారు. వారణాసి కలెక్టరేట్‌లో మోదీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మోదీ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన వారిలో బనారస్ హిందూ వర్సిటీ మహిళా కళాశాల మాజీ ప్రిన్సిపాల్ అన్నపూర్ణ శుక్లా, కాశీలోని మణికర్ణిక దహన వాటిక ప్రధాన నిర్వాహకుడు జగదీశ్ చౌధరి, బీజేపీ కార్యకర్త సుభాష్ గుప్తా, మోదీ బాల్య మిత్రుడు, వ్యవసాయ శాస్త్రవేత్త శంకర్ పటేల్ ఉన్నారు. నామినేషన్ దాఖలుకు ముందుగా ప్రధాని మోదీ.. బాదల్, అన్నపూర్ణ శుక్లా పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
అప్రమత్తంగా ఉండండి
బూత్ స్థాయి నేతలు, కార్యకర్తల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘వారణాసిలో మోదీ ఇప్పటికే గెలిచినట్లు వాతావరణం సృష్టించి, ఓటు వేయకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి వారి ఉచ్చులో పడకండి’ అని ప్రజలకు ఉద్బోధించారు. మునుపెన్నడూ లేని విధంగా, ఈసారి అధికార పక్షానికి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. ‘ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు వంటి విషయాలపై చర్చిస్తూ సమయం వృథా చేయవద్దు. అతి విశ్వాసం, దురుసుతనం పనికి రావు’ అని కార్యకర్తలకు హితవు పలికారు. ‘ప్రతి అభ్యర్థీ గౌరవనీయుడే, అతడు మన శత్రువు కాదు. ఎన్నికల సందర్భంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండగ వాతావరణం కనిపిస్తోంది’ అని అన్నారు.
ప్రధాని ఆస్తులు రూ. 2.5 కోట్లు
2014 ఎన్నికల అఫిడవిట్‌లో రూ.1.65 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించిన మోదీ.. రూ.2.5 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తాజా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో రూ.1.1 కోట్ల విలువైన ఇల్లు, రూ.1.27 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ.38,750 నగదు, రూ.1.13 లక్షల విలువైన 45 గ్రాముల బరువైన 4 ఉంగరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అందే వేతనం, బ్యాంకు వడ్డీల ద్వారా ఆదాయం సమకూరుతోందని వివరించారు. 1967లో పదో తరగతి, 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ, 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందినట్లు తెలిపారు.
జెశోదాబెన్‌ను భార్యగా పేర్కొన్న మోదీ.. ఆమె ఆదాయ వనరులు, వృత్తి వివరాలు తనకు తెలియవని పేర్కొన్నారు. తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని, ప్రభుత్వానికి ఎటువంటి బకాయి పడలేదని తెలిపారు. అంతకుముందు జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ నామినేషన్ పత్రాల్లో భార్య కాలమ్‌ను నింపకుండా ఖాళీగా వదిలి వేసేవారు. అయితే, నామినేషన్ పత్రాల్లో ఎటువంటి ఖాళీలున్నా అధికారులు తిరస్కరించవచ్చని ఈసీ తెలపడంతో 2014 ఎన్నికల నుంచి సంబంధిత కాలమ్‌లో వివాహితుడినంటూ భార్య పేరు జశోదాబెన్‌గా పేర్కొంటున్నారు.
నామినేషన్ వేసేముందు బాదల్ ఆశీర్వాదం తీసుకుంటున్న మోదీ
వారణాసి కలెక్టర్ ఆఫీసులో అమిత్ షాతో ముచ్చటిస్తున్న మోదీ
Comments
Please login to add a commentAdd a comment