రంజాన్ లేదా రందాన్ ? | Why are Indian Muslims using the Arabic word 'Ramadan' instead of the traditional 'Ramzan'? | Sakshi
Sakshi News home page

రంజాన్ లేదా రందాన్ ?

Published Sat, Jun 20 2015 12:01 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

రంజాన్ లేదా రందాన్ ? - Sakshi

రంజాన్ లేదా రందాన్ ?

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ లేదా రందాన్ మాసం శుక్రవారం ప్రారంభమైంది. ముస్లిం క్యాలెండర్ ప్రకారం తొమ్మిదవ నెలలో వచ్చే ఈ మాసాన్...

 న్యూఢిల్లీ: ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ లేదా రందాన్ మాసం శుక్రవారం ప్రారంభమైంది. ముస్లిం క్యాలెండర్ ప్రకారం తొమ్మిదవ నెలలో వచ్చే ఈ మాసాన్ని రంజాన్ అని పిలవాలా లేక రందాన్ అని పిలవాలా? అన్న సంశయం సగటు ముస్లింలకే కాకుండా విద్యావేత్తలకు కూడా కలుగుతోంది. భారతీయ ముస్లిం సంస్కృతి ప్రకారం గతంలో రంజాన్ అనే పిలిచేవారు.

కానీ ఇటీవల కాలంలో ఖురాన్‌లో రందాన్ అనే ఉన్నది కనుక అలాగే పిలవాలనే వాదనలు పెరిగి భారత ఉపఖండంలో కూడా అలాగే పిలుస్తున్నారు. మూలం ఒకటే అయినప్పుడు ఉచ్ఛారణ ఎలా ఉంటే మాత్రమేమిటనే ప్రశ్నించేవారు లేకపోలేదు. ఎలా ఉన్న ఒప్పుకునేవారుంటే ఫర్వాలేదుగానీ ఇలాగే ఉచ్ఛరించాలంటూ ఓ రూలుగా మాట్లాడినప్పుడే ఆ పదం మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఏ పదం ఉచ్ఛారణపైనా స్థానిక సాంస్కృతిక ప్రభావం తప్పకా ఉంటుంది.

భాషా శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం రంజాన్ లేదా రందాన్ పదం మూలాల్లోకి వెళితే రందాన్ అరబిక్ పదం. రంజాన్ పదం పర్షియన్ పదం. ఖురాన్‌లో రందాన్ అని ఉన్నది కనుక అలాగే ఉచ్ఛరించాలని ఢిల్లీ రచయిత రణ సఫ్వీ వాదిస్తున్నారు. ఇక్కడ మరో విచిత్రమేమిటంటే ఖురాన్ లిఖించిన సమయంలో 'డీ'కి ఉన్న ఉచ్ఛారణ ఇప్పటి అరబికుల్లో లేదు. వారి ఉచ్ఛారణ ఇప్పటికే ఎంతో మారిపోయింది. ఎక్కడైనా స్థానిక సంస్కృతినిబట్టే వారి ఉచ్ఛారణలు ఉంటాయని చరిత్రకారులు ఎప్పుడో సూత్రీకరించారు. ఆ లెక్కన భారతీయ ముస్లింలపై పర్షియన్ల ప్రభావమే ఎక్కువ. అందుకే ఇంతకాలం ఇక్కడ రంజాన్ అని పిలుస్తూ వచ్చారు.

ప్రపంచంలో అరబిక్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొదటి నుంచి రందాన్ అని పిలుస్తూ వచ్చారు. సరే అరబిక్ ప్రకారమే రందాన్‌ను ఉచ్ఛరిద్దామనే సూత్రీకరణకు మనమూ వచ్చామనుకుద్దాం. ‘నమాజ్’ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందే. అరబిక్‌లో దీన్ని 'సలాహ్' అని పిలుస్తారు. రోజా కూడా పర్షియన్ పదమే, దీన్ని అరబిక్‌లో సామ్ (ఎస్‌ఏడబ్లూఎం) అని పిలుస్తారు. అంతెందుకు ‘ఖుదా’ అనే పదం ఫార్సీ నుంచి వచ్చింది. మరీ ఈ పదాల ఉచ్ఛారణను అలాగే ఉంచవచ్చా? అరబిక్ పదం 'రందాన్'లాగా వీటిని కూడా మార్చుకోవచ్చా? భారత్‌లోని బెంగాలీ భాషలోనే 'జెడ్' అనే ఆంగ్ల అక్షరానికి సమానమైన ఉచ్ఛారణ పదమే లేదు. మరి వారెలా పలకాలి అన్నది కూడా ప్రశ్నే కదా!.

 భారత ఉపఖండంలోనే ఉన్న పాకిస్తాన్‌లో కూడా ప్రజలు గతంలో రంజాన్ అనే పిలిచేవారు. అక్కడి టీవీ జర్నలిస్టులు ఆంగ్ల భాష యాసలో స్టైలిష్‌గా పలకడం కోసం 'రందాన్' అనడం మొదలుపెట్టారట. కాలక్రమంలో అక్కడ అరబిక్  'రందాన్'  ఉచ్ఛారణ స్థిరపడిపోయింది. పొరుగునే ఉన్నాం కనుక మనంపై కూడా ఆ ప్రభావం పడిందిమో!


 (గమనిక: రంజాన్ లేదా రందాన్ పదంపై సామాజిక వెబ్‌సైట్లలో చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ వార్త ఇవ్వడం సముచితమని భావిస్తున్నాం-సాక్షి డాట్ కామ్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement