
నేతాజీ అస్తికలు తెచ్చేందుకు కేంద్రం నో!!
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలు జపాన్ రాజధాని టోక్యోలోని ఓ బౌద్ధ ఆలయంలో ఉన్నప్పటికీ వాటిని స్వదేశానికి తిరిగి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విముఖత చూపిస్తూ వచ్చింది. నేతాజీ అస్తికలు భారత్‌కు తీసుకువస్తే దేశంలో రాజకీయ దుమారం చెలరేగే అవకాశముంటుందనే భయంతోనే ప్రభుత్వం ఇందుకు సాహసించడం లేదని 1970 నాటి ఓ పత్రం వెల్లడించింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి సందర్భంగా ఆయన అదృశ్యానికి సంబంధించిన 100 వర్గీకృత పత్రాలను ప్రధాని నరేంద్రమోదీ బహిర్గత పరిచారు. ఇందులో కేంద్ర హోంశాఖకు సంబంధించిన పత్రంలో నేతాజీ అస్తికల గురించి సమాచారముంది. టోక్యోలోని రెంకోజి ఆలయంలో ప్రధాన పూజారి అధీనంలో ఉన్న బోస్ అస్తికలను స్వదేశానికి తరలించాలని అక్కడి భారత రాయబార కార్యాలయం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో సమన్వయంగా వ్యవహరించినప్పటికీ పెద్దగా పురోగతి మాత్రం సాధ్యపడలేదు.
చాలామంది అధికారులు బోస్ అస్తికలను భారత్‌కు తీసుకురావాలని ప్రతిపాదించారని 200 పేజీలున్న ఈ పత్రం తెలిపింది. అయితే కేంద్రం మాత్రం ఇందుకు సుముఖత చూపలేదు. 1945 ఆగస్టులో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించలేదని భావిస్తున్న నేతాజీ కుటుంబసభ్యులు, కొన్ని వర్గాల ప్రజలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించే అవకాశముండటం ఇందుకు కారణమని 1976లో విదేశాంగ శాఖ ఉత్తర, తూర్పు ఆసియా జాయింట్ సెక్రటరీ ఎన్‌ఎన్ ఝా ఈ పత్రంలో పేర్కొన్నారు. ఆ సమయంలో దేశంలో ఎమర్జెన్సీ పాలనలో ఉంది.