సోనియాను కూడా వదిలిపెట్టని వివాదాస్పదుడు | Why Manishankar suspended | Sakshi
Sakshi News home page

సోనియాను కూడా వదిలిపెట్టని వివాదాస్పదుడు

Published Fri, Dec 8 2017 4:23 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Why Manishankar suspended - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివాదాలకు మారుపేరు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌. అనవసరంగా ఎదుటివారి మీద నోరు పారేసుకోవడం పార్టీని ఇరుకున పెట్టడం ఆయనకు మొదటి నుంచి అలవాటే. ఈసారి సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘నీచ్‌ ఆద్మీ’ ( నీచమైన మనిషి అనే అర్థంకన్నా నీచ, అంటే తక్కువ జాతికి లేదా కులానికి చెందిన వ్యక్తి అనే అర్థం ఎక్కువ వస్తుంది) సంబోధించడం కొత్త వివాదాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్నే కోల్పోయారు. పార్టీ అధ్యక్షుడు కాబోతున్న రాహుల్‌ గాంధీ ఆయన వ్యాఖ్యలను తప్పు పట్టడంతో పార్టీ అధిష్టానం ఆయనపై చర్య తీసుకుంది. వాస్తవానికి ఇలాంటి విషయంలో ఆయనపై పార్టీ అధిష్టానం ఎప్పుడో చర్య తీసుకోవాల్సిందీ.

2014లో కూడా మణిశంకర్‌ అయ్యర్‌ బీజేపీ పార్టీ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘ఛాయ్‌వాలా’ అనే సంబోంధించారు. మోదీ గెలిచే అవకాశం లేనందున ఆయన కోసం ‘ఛాయ్‌’ అమ్ముకునే చోటును మాత్రం వెతికి పెడతామని కూడా వ్యాఖ్యానించారు. నాడు, నేడు కూడా అయ్యర్‌ వ్యాఖ్యలను మోదీ విజయవంతంగా తిప్పికొట్టడమే కాకుండా కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెట్టారు. మణిశంకర్‌ అయ్యర్‌ విమర్శలు విపక్ష పార్టీ నాయకులపైనే కాదు, సొంత పార్టీ నాయకులపై కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ముఖ్యంగా తనకంటే తక్కువ మేథావులనుకున్న వారిని ఎక్కువ హేళన చేసేవారు.

గాంధీ కుటుంబం విధేయుడు, మాజీ మంత్రి కే. నట్వర్‌ సింగ్‌ ఓసారి సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ సందర్శకుల పుస్తకంలో ‘నేను ఇంత వాడిని అవడానికి ఈ కాలేజీయే కారణం’ అని రాశాడట. దాని కిందనే ‘ఎందుకు కాలేజేని నిందిస్తాం?’ అని మణిశంకర్‌ అయ్యర్‌ రాశారని చెబుతారు. మణిశంకర్‌ అయ్యర్‌ కూడా అదే కాలేజీలో చదువుకున్నారు. మాజీ కాంగ్రెస్‌ మంత్రి అజయ్‌ మేకన్‌ ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని తప్పుపడుతూ ఆయన సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో చదువుకోలేదుకదా! అని కూడా వ్యాఖ్యానించారు. ఓసారి తన ఇంటి పక్కనే ఉండే తన ‘ఐఎఫ్‌ఎస్‌’ సహచరుడి గురించి అయ్యర్‌ ప్రస్తావిస్తూ ‘నా నుంచి రక్షించుకునేందుకు నీవు చాలా ఎల్తైన ప్రహరీ గోడను కట్టుకున్నావు. నెనెప్పుడైనా వెన్నుపోటే పొడుస్తానని తెలియదు పాపం!’ అని వ్యాఖ్యానించారు.

అయ్యర్‌ క్రీడల మంత్రిగా ఉన్నప్పుడు తన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నే విమర్శించి ఇరుకున పెట్టారు. కామన్‌వెల్త్‌ క్రీడలను ప్రారంభించాల్సిన ఆయన క్రీడలకు వ్యతిరేకంగా రాజ్‌ఘాట్‌ వద్ద ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థను ప్రోత్సహించడంలో మన్మోహన్‌ సింగ్‌ అనుసరిస్తున్న ఆర్థిక పంథాను అయ్యర్‌ తప్పు పట్టారు. అంతేకాకుండా ఆయన ఆర్థిక విధానాలు వామపక్షాల తీవ్రవాదాన్ని నిర్మూలించేవిగా ఉన్నాయంటూ దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలతో లక్ష శాతం ఏకీభవిస్తున్నానని చెప్పారు. పాకిస్థాన్‌ పట్ల కాంగ్రెస్‌ వైఖరిని కూడా ఆయన ఎప్పుడూ తప్పుపట్టేవారు.

ఆయన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా విడిచిపెట్టకుండా విమర్శనాస్త్రాలను సంధించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఆయనకు ఏ పదవి దక్కనప్పుడు ‘కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యులు కావాలంటే రెండు అర్హతలు ఉండాలి. ఒకటి డిగ్రీ ఉండకూడదు. రెండూ బైపాస్‌ సర్జరీ అయ్యుండాలి. ఈ రెండింటిలోనూ నేను అర్హుడిని కాను’ అని అన్నారు. సోషల్‌ గ్యాదరింగ్‌లలో అతి«థులు ఇబ్బందిపడేలా సోనియా గాంధీని తాను ఎలా విమర్శించేదో ఆయనే పలుసార్లు చెప్పుకున్నారు. ‘నేను ఓసారి అలా విమర్శిస్తుంటే పక్క గదిలో నుంచి మనీ!...నేనిక్కడున్నాను. అంటూ బాగా పరిచయం ఉన్న గొంతు (సోనియా) వినిపించగానే అంతటితో ఆపేసేవాణ్ని’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఓ హిందీ పత్రిక ‘మణి హై కీ మాన్‌తా నహీ’ పేరిట ప్రచురించింది.

నిజం చెప్పాలంటే మణిశంకర్‌ అయ్యర్‌ ఆషామాషీ వ్యక్తి కాదు. ప్రతిష్టాకరమైన డూన్స్‌ స్కూల్, సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో చదివి కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొందారు. ఐఎఫ్‌ఎస్‌ పూర్తిచేసి దౌత్యవేత్తగా విజయవంతంగా పనిచేశారు. 1980 దశకంలో రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అంతర్జాతీయ సంబంధాల నుంచి స్థానిక పంచాయితీ రాజకీయాల వరకు అన్ని అంశాలు క్షుణ్నంగా తెలిసిన వ్యక్తి. మంచి వక్త. టీవీ మీడియాలో పాపులర్‌.  మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో పెట్రోలియం, క్రీడలు, పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రిగా రాణించారు. సోనియా గాంధీ స్పీచ్‌ రైటర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయినాగానీ ఇతరులను తూలనాడుటలో సమతౌల్యం ఉండేది కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement