
మా వాడికి బెయిలొస్తే.. మీకు నొప్పేంటి?
కరడుగట్టిన నేరస్థుడు మహ్మద షహాబుద్దీన్‌కు బెయిల్ రావడాన్ని ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ సమర్థించుకున్నారు. ఆ బెయిల్ మీద వివాదం అంతా బీజేపీ, మీడియా సృష్టే తప్ప ఇంకేమీ కాదన్నారు. కోర్టులు మాత్రమే ఇలాంటి విషయాలపై నిర్ణయం తీసుకుంటాయని లాలు చెప్పారు. అసలు షహాబుద్దీన్‌కు బెయిల్ వస్తే మీడియాకు నొప్పేంటని అడిగారు. ఈ విషయంలో మీడియా ఎందుకంత ఆసక్తి చూపిస్తోందని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలపై ప్రశ్నించడానికి మీడియా ఎవరని.. ప్రతివాళ్లూ కోర్టు నిర్ణయాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.
మీడియా వాళ్లు బీజేపీతో కుమ్మక్కు కావడం వల్లే షహాబుద్దీన్ బెయిల్‌ను ప్రశ్నిస్తున్నారని లాలు చెప్పారు. ఈ బెయిల్‌ను సవాలు చేస్తూ అప్పీలు చేయాలని నితీష్ కుమార్ ప్రభుత్వం భావిస్తున్నా, లాలు మాత్రం షహాబుద్దీన్‌ను వెనకేసుకువచ్చారు. 11 ఏళ్లపాటు జైల్లోనే ఉన్న అతడికి పట్నా హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గత శనివారం ఉదయం భాగల్‌పూర్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతడిపై పలు హత్యకేసులతో పాటు దాదాపు 50 క్రిమినల్ కేసులున్నాయి. అతడి బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ నిర్ణయించుకున్నారు.