
సర్జికల్ దాడులపై రాజకీయాలా?: మోదీ
వారణాసి: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్ 40 ఏళ్లుగా ఉన్నా ఏ పార్టీ కూడా ఏం చేయలేకపోయిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తాము పార్లమెంటు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామని, అధికారంలోకి రాగానే ఇచ్చేశామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న నరేంద్రమోదీ వారణాసిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అసలు జాతీయ భద్రతపరమైన అంశాలను ఎందుకు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.
దేశ భద్రత కోసం తీసుకొనే అలాంటి నిర్ణయాలను ఎందుకు? ఎలా ప్రశ్నించగలుగుతున్నారని అన్నారు. ఎవరు సర్జికల్ దాడులను ప్రశ్నిస్తున్నారో వారు జాన్‌పూర్ వెళ్లి అమర జవానుల కుటుంబాలను అడగాలని, అప్పుడు ఎందుకు సర్జికల్ దాడులు చేయాల్సి వచ్చిందో తెలుస్తుందని చెప్పారు. తాము చేసిన హామీలను మర్చిపోబోమని, ఉత్తరప్రదేశ్‌లో అధికారం వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే సన్నకారు రైతులకు రుణాలనిచ్చే విధానం సరళీకృతం చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు ఆయన వారణాసిలోని కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.