![wife of Journalist Prashant Moved Supreme Court For Release - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/10/prashant.jpg.webp?itok=xWD1_Nzz)
సాక్షి, న్యూఢిల్లీ : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై అభ్యంతరకర పోస్టులు చేసినందుకు అరెస్ట్ అయిన ఢిల్లీ జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియా విడుదల కోరుతూ ఆయన భార్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేశారనే ఆరోపణలపై శనివారం నుంచి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తన భర్త కనోజియాను అరెస్ట్ చేసే క్రమంలో సరైన పద్ధతులను పోలీసులు పాటించలేదని, ఆయన అరెస్ట్ అక్రమమని జగీష అరారా పేర్కొన్నారు.
తన భర్తను కేవలం ఐదు నిమిషాల్లో అదుపులోకి తీసుకున్నారని, దుస్తులు మార్చుకుని ఆయన పోలీసుల వెంట వెళ్లారని అరోరా చెప్పారు. కనోజియాపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ అక్రమమని, ఆయన అరెస్ట్‌కు ఎలాంటి వారెంట్ జారీ చేయలేదని అరోరా న్యాయవాది షాదన్ ఫరసత్ అన్నారు. పరువునష్టం చట్టం కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో మేజిస్ర్టేట్ చొరవ తీసుకోవాలని పోలీసులు కాదని న్యాయవాది చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన అభియోగాలు బెయిల్ ఇవ్వదగినవేనని అన్నారు. తన భర్తను తక్షణమే విడుదల చేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ అరోరా సుప్రీం కోర్టును కోరారు. సుప్రీం కోర్టు మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టనుంది.
కాగా, ఢిల్లీలో జర్నలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ కనోజియాను యూపీ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. యోగిపై పరువుకు భంగం కలిగేవిధంగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిందనందుకు అతన్ని అరెస్ట్ చేసినట్లు హజరాత్‌ఘంజ్ పోలీసు అధికారులు తెలిపారు. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. తప్పుడు పోస్ట్‌ను షేర్ చేసినందుకు ఐపీసీ సెక్షన్ 500 ప్రకారం వారందరనీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే సీఎం యోగి తనని వివాహం చేసుకుంటానని మాట ఇచ్చారని.. తనుకు ఆయనతో ఎప్పటి నుంచో సంబంధం ఉందంటూ ఓ మహిళ మీడియాతో మాట్లాడుతన్న వీడియోను అతను షేర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment