![ముంబై హైకోర్టు](/styles/webp/s3/article_images/2017/09/2/71420907578_625x300.jpg.webp?itok=7_CwOup3)
ముంబై హైకోర్టు
ముంబై: భార్య తరచూ పబ్‌లకు వెళుతుందని, బిడ్డ బాగోగులు పట్టించుకోవడం లేదని విడాకులు మంజూరు చేయాలని ఓ భర్త పెట్టుకున్న ఆర్జీని ముంబై హైకోర్టు తిరస్కరించింది. ఈ కారణంతో విడాకులు ఇవ్వలేమని జస్టిస్ విజయ తహిల్రమణి, అనిల్ మీనన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 'నా భార్య దురుసుగా ప్రవర్తిస్తోంది. పబ్‌కు వెళ్తోంది. బిడ్డ బాగోగుల గురించి పట్టించుకోవడం లేదు. నన్ను కొట్టింది. వేడి టీ నాపైన విసిరికొట్టింది' అని ఆయన తన అప్పీల్‌లో పేర్కొన్నారు. అయితే ఈ కారణాలతో విడాకులివ్వలేమని, అతను వీటిని నిరూపించడంలో విఫలమయ్యాడని, దీనిని నేరంగా పరిగణించి విడాకులు మంజూరు చేయలేమని ధర్మాసనం తీర్పిచ్చింది. ఫ్యామిలీ కోర్టిచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది.
'భార్య తనను హింసించిందని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. దీనికి సరైన సాక్ష్యాధారాలు లేవు. అయినా, ఇది తీవ్రమైన నేరం కాదు. వీటిని పరిగణలోకి తీసుకొని విడాకులు మంజూరు చేయలేం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ జంట గత 20 ఏళ్ల కింద పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బిడ్డ ఉంది. అయితే వీరు 4 ఏళ్లు మాత్రమే కలిసున్నారు. 16 ఏళ్ల నుంచి విడిగా జీవిస్తున్నారు. బిడ్డ తండ్రి పర్యవేక్షణలో ఉంది.