రైతు ప్రయోజనాలే ముఖ్యం
కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టీకరణ
డబ్ల్యూటీవోలో సంపన్న దేశాల ఒత్తిడిని తట్టుకుంటాం
ప్రజల పొదుపు మొత్తాలే దేశానికి పెట్టుబడి
న్యూఢిల్లీ: రైతుల ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) చర్చల్లో అభివృద్ధి చెందిన దేశాల ఒత్తిడికి తలొగ్గి భారతీయ రైతులకు నష్టం కలిగేలా వ్యవహరించబోమని హామీ ఇచ్చారు. ‘ఈ విషయంలో ప్రపంచంలోని బలమైన దేశాలతో దృఢంగా వ్యవహరించాల్సి ఉంది’ అన్నారు. గత ప్రభుత్వ విధానాలనే తామూ కొనసాగిస్తే.. చిన్న రైతుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ఢిల్లీ శాఖ శనివారం ఏర్పాటు చేసిన బడ్జెట్‌పై చర్చ’ కార్యక్రమంలో జైట్లీ ప్రసంగించారు. ‘‘ఆహార భద్రత విషయంలో భారత్ దృఢంగా వ్యవహరించినందువల్ల ఇటీవల జెనీవాలో జరిగిన డబ్ల్యూటీవో చర్చలు విఫలమయ్యాయి. మాకు రైతుల ప్రయోజనాలే ముఖ్యం. మాపై చాలా ఒత్తిడి ఉంది. అయినా అన్ని చర్చల్లోనూ పాల్గొనాలి. పేద రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో వెనక్కుతగ్గొద్దని గట్టిగా నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు. భారత్‌లోని చిన్న, సన్నకారు రైతులు దారుణమైన కష్టాల్లో ఉన్నారని, వ్యవసాయం కోసం అప్పు తెచ్చి, ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పొదుపే పెట్టుబడి..
ప్రజలు బ్యాంకుల్లో చేసే పొదుపు మొత్తాలు దేశానికి పెట్టుబడిలా ఉపయోగపడ్తాయని అరుణ్ జైట్లీ అన్నారు. ప్రజలందరికీ బ్యాంకు సేవలు అందించడం లక్ష్యంగా ‘ఫైనాన్స్ ఇన్‌క్లూజన్’ ప్రచార కార్యక్రమాన్ని ఈనెల 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించనున్నారని జైట్లీ వెల్లడించారు.
డబ్ల్యూటీవోలో భారత్ వాదనేంటి?
వ్యవసాయ సబ్సిడీలపై భారత్ అభ్యంతరాలను సంపన్న దేశాలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఇటీవల జెనీవాలో జరిగిన డబ్ల్యూటీవో చర్చలు విఫలమయ్యాయి. భారత్ లేవనెత్తుతున్న అంశాలను పట్టించుకోకుండా.. వాణిజ్య సౌలభ్య ఒప్పందం(ట్రేడ్ ఫెలిసిటేషన్ అగ్రిమెంట్-టీఎఫ్‌ఏ)ను ఉన్నదున్నట్లుగా భారత్ అంగీకరించాలని ఆ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఆహారోత్పత్తుల నిల్వ, ఆహార సబ్సిడీల లెక్కింపుకు సంబంధించి డబ్ల్యూటీవో నిబంధనల్లో సవరణలు కావాలని భారత్ కోరుతోంది. మొత్తం ఆహారోత్పత్తుల విలువలో సబ్సిడీలు 10 శాతంగా ఉండాలని ప్రస్తుత డబ్ల్యూటీవో నిబంధనలు చెబుతున్నాయి. అయితే, 20 ఏళ్ల కిందటి ధరల ఆధారంగా వాటిని లెక్కిస్తున్నారు. సబ్సీడీల విషయంలో 1986-87ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకోవద్దని, ప్రస్తుత ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గుల్ని పరిగణనలోకి తీసుకుని ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చాలని భారత్ కోరుతోంది. అలాగే, 10% ఆహార సబ్సిడీతో భారత్‌లో ఆహార భద్రత పథకాన్ని అమలు చేయడం సాధ్యంకాదు. అది 10% దాటితే.. భారత్‌పై జరిమానాలు, ఆంక్షలు విధించే అవకాశముంది.