
న్యూఢిల్లీ: సంపన్న పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో రైతులకిచ్చే సబ్సిడీలు చాలా తక్కువేనని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ తెలిపారు. సంపన్న దేశాల్లో బిలియన్ల కొద్దీ డాలర్ల మేర రైతాంగానికి సబ్సిడీలు లభిస్తాయని చెప్పారు. భారత్‌లో ఏటా ఒకో రైతుకు సుమారు 250 డాలర్ల సబ్సిడీ మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నా.. వ్యవస్థలో లోపాల కారణంగా ఈ కాస్త సబ్సిడీలు కూడా వివాదాలకు దారి తీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సబ్సిడీల అమలు తీరుతెన్నుల గురించి ఇతర దేశాల నుంచి మరింతగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వాధ్వాన్ చెప్పారు. భారత ప్రభుత్వం రైతులకు భారీగా సబ్సిడీలు ఇస్తోందంటూ అమెరికా, యూరోపియన్ యూనియన్‌లోని సంపన్న దేశాలు .. ఆరోపిస్తున్నాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీవో నిర్దేశిత 10 శాతం పరిమితికి లోబడే సబ్సిడీలు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఎగుమతి సబ్సిడీల వివాదంపై భారత్ మీద అమెరికా.. డబ్ల్యూటీవోకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే వాధ్వాన్ తాజా వివరణనిచ్చారు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆవులకి సంబంధించి ఇచ్చే సబ్సిడీ నిధులతో.. ఓ ఆవు ఖరీదైన విమానం బిజినెస్ తరగతిలో ప్రపంచం మొత్తం రెండు సార్లు చుట్టేసి రావొచ్చన్న జోక్‌ను ఈ సందర్భంగా ఉదహరించారు. అమెరికా, ఈయూ భారీగా సబ్సిడీలు ఇస్తుంటాయని, కానీ వాటిని తెలివిగా డబ్ల్యూటీవో నిర్దేశిత వివిధ పథకాల కింద సర్దేసి చూపించేస్తుంటాయని వాధ్వాన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment