ఓ పాత జోకు.. భారతీయుల మనస్తత్వాన్ని తెలిపేందుకు.. ఇంట్లో కరెంటు పోయిందట.. జపానోళ్లు అయితే ఫ్యూజ్ చెక్ చేస్తారట.. అమెరికాలో పవర్ హౌస్‌కు ఫోన్ చేస్తారట.. మరి మన దగ్గరో.. పక్కింట్లో కరెంటు ఉందో లేదో చెక్ చేస్తారట.. అదే అలవాటు ప్రకారం ఓసారి 4జీ గురించి కూడా పక్కింట్లో(పొరుగు దేశాల్లో) చెక్ చేసి వద్దాం.. ఎందుకంటే.. ఇప్పుడంతా 4జీ మయం.. ఇంత స్పీడ్ అంత స్పీడ్ అని చెప్పుకుంటున్నాం.. అందుకే ఓసారి అక్కడి పరిస్థితి ఎలా ఉందో చెక్ చేసి వద్దాం.. వాళ్లతో పోలిస్తే.. మన 4జీ ఎల్‌టీఈ(లాంగ్ టెర్మ్ ఎవల్యూషన్) స్పీడ్ ఎంతో లెక్కేసి వద్దాం.. అయితే.. జోకులో అన్నట్లుగా పక్కింట్లోనూ కరెంటు లేదా.. అయితే ఓకే అని ఇక్కడ అనుకోవడానికి లేదు.. ఎందుకంటే.. మన పొరుగుదేశాల్లో 4జీ స్పీడు మనకంటే చాలా మెరుగ్గా ఉంది. ఎక్కడో ఉన్న అమెరికాలాంటివి వద్దు.. పక్కనున్న పాకిస్తాన్, శ్రీలంకతో పోల్చినా కూడా అదే పరిస్థితి. అంటే.. మన అందరి వద్ద 4జీలు ఉన్నా.. స్పీడు విషయానికొస్తే.. అవన్నీ ‘స్లో’జీలే అన్నమాట.. వైర్‌లెస్ కవరేజీని మ్యాపింగ్ చేసే బ్రిటన్ సంస్థ ‘ఓపెన్ సిగ్నల్’ మొత్తం 88 దేశాల్లో 4జీ ఎల్‌టీఈ స్పీడ్‌కు సంబంధించిన ఫిబ్రవరి నెల నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో మనం మొదటి స్థానంలో ఉన్నాం! అయితే.. చివరి నుంచి!!
భారత్‌లో సగటు డౌన్‌లోడ్ స్పీడు 6.07 ఎంబీపీఎస్ (మెగాబైట్స్ పర్ సెకండ్) అట. అదే పాకిస్తాన్‌లో ఈ వేగం 13.56.. శ్రీలంకలో 13.95 ఎంబీపీఎస్‌గా ఉంది. మొదటి స్థానంలో ఉన్న సింగపూర్‌లో 4జీ స్పీడు 44 ఎంబీపీఎస్‌గా ఉంది. అయితే.. స్పీడు విషయంలో ఎలాగున్నా.. 4జీ విస్తృతి.. లభ్యత విషయంలో మాత్రం మనం 14 స్థానంలో ఉన్నాం. దేశంలో 4జీ కవరేజీ 86.26 శాతంగా ఉంది. ఈ జాబితాలో దక్షిణ కొరియా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 96 శాతం 4జీ కవరేజీ పరిధిలో ఉంది. పాక్‌లో ఇది 66 శాతంగా.. శ్రీలంకలో 45 శాతంగా ఉంది. 4జీ ఎల్‌టీఈకి సంబంధించి అడ్వాన్స్‌డ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని దేశాలు స్పీడు విషయంలో ముందంజలో ఉన్నాయని ‘ఓపెన్ సిగ్నల్’ పేర్కొంది. అయితే.. దక్షిణ కొరియా, సింగపూర్ వంటి చోట్ల మొబైల్ టారిఫ్ ఎక్కువగా ఉంటుందని.. దీని వల్ల నెట్‌వర్క్‌పై ఒత్తిడి తక్కువగా ఉండి.. వేగం విషయంలో స్థిరత్వం ఉందని.. భారత్ వంటి దేశాల్లో మొబైల్ నెట్ వినియోగదారులు ఎక్కువని.. దీని వల్ల నెట్‌వర్క్‌పై ఒత్తిడి ఎక్కువగా పడి.. స్పీడు తగ్గుతోందని తెలిపింది. ఎల్‌టీఈ అడ్వాన్స్‌డ్ నెట్‌వర్క్‌ను విస్తృతపరచడమొక్కటే దీనికి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు మన దగ్గర కూడా 4జీ డౌన్‌లోడ్ స్పీడు బాగా పెరుగుతుందని పేర్కొంటున్నారు.
– సాక్షి, తెలంగాణ డెస్క్
42% : ఇంకా ‘డౌన్’లోడింగే
Published Thu, Feb 22 2018 2:07 AM | Last Updated on Thu, Feb 22 2018 11:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment