
న్యూఢిల్లీ: 4జీ, ఎల్‌టీఈ, 5జీ మోడెమ్స్‌లో ఉపయోగించడానికి అనువైన సెమీకండక్టర్ చిప్స్‌ను తొలిసారి దేశీయంగా రూపొందించినట్లు బెంగళూరుకు చెందిన సిగ్నల్‌చిప్ వెల్లడించింది. ఇందులో నాలుగు చిప్‌ల శ్రేణిని బుధవారం ఆవిష్కరించింది. వీటి వినియోగం కోసం సంబంధిత రంగ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సిగ్నల్‌చిప్ వ్యవస్థాపకుడు, హిమాంశు ఖస్నిస్ వెల్లడించారు. తొలి దేశీ సెమీకండక్టర్ చిప్‌ల రూపకల్పనపై సిగ్నల్‌చిప్ సంస్థను టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ అభినందించారు. మరోవైపు, భద్రతాప్రమాణాలకు సంబంధించి అంతర్జాతీయంగా చైనా టెలికం పరికరాల తయారీ సంస్థలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై మరింతగా అధ్యయనం చేయనున్నట్లు అరుణ చెప్పారు.
‘చాలా దేశాలు చైనా సంస్థల టెలికం పరికరాల విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి భారత్ కూడా దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది‘ అని చిప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు చైనా కంపెనీలు.. ముఖ్యంగా హువావే సంస్థ తయారు చేసే టెలికం పరికరాలను ఉపయోగించరాదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అరుణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, హువావేకి వ్యతిరేకంగా కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. జర్మనీ తదితర దేశాలు మాత్రం ఆ సంస్థ పరికరాల వినియోగం కొనసాగించే యోచనలో ఉన్నాయి.