రైతుల శ్రమ వృథా కాదు
పంటకు మద్దతు ధర ఇస్తాం.. శాంతించండి
► రైతులకు మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ పిలుపు
► శాంతి కోసం సీఎం నిరవధిక నిరాహార దీక్ష
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, అన్నదాతలు ఆందోళన విరమించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ కోరారు. రైతుల శ్రమ వృథాకానీయమని సమస్యలు తెలిసిన ప్రభుత్వంగా వారి పంటకు సరైన మద్దతుధర కల్పిస్తామన్నారు. రైతుల ఆందోళన రోజురోజుకూ ఉధృతమవుతున్న నేపథ్యంలో శాంతియుత పరిస్థితులు ఏర్పడేందుకు భోపాల్‌లోని దసరా మైదాన్‌లో శనివారం చౌహాన్ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు.
భారీ సంఖ్యలో రైతులతోపాటు పార్టీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని వారి పంటకు సరైన ధర ఇస్తామని చౌహాన్ అన్నారు. ‘పంట ఉత్పత్తి అనుకున్నదానికన్నా ఎక్కువగా రావటంతో ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. నాకు మీ (రైతుల) సమస్యలు తెలుసు. ప్రభుత్వం అండగా ఉంటుంది. మేం పంటను మీకు లాభం చేకూర్చే ధరకే కొనుగోలు చేస్తాం’ అని చౌహాన్ స్పష్టం చేశారు.
రైతుల కోసం మరెన్నో చేస్తాం
ఇప్పటికే కనీస మద్దతు ధరతో (కిలో రూ.8) ఉల్లిగడ్డలు కొనుగోలు చేసిన విషయాన్ని చౌహాన్ గుర్తుచేశారు. ‘శ్రమ వృథా కానీయం. అన్ని ధాన్యాలను కనీస మద్దతు ధర ఇచ్చే కొనుగోలు చేస్తాం. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నాం’ అని సీఎం తెలిపారు. గతేడాది సోయాబీన్ పంట నష్టపోతే రూ.4,800 కోట్లు పరిహారం ఇచ్చామని.. రూ.4,400 కోట్ల పంటబీమా అందజేశామన్నారు. 11 గంటలకు వేదికపైకి వచ్చిన చౌహాన్ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దసరా మైదాన్ నుంచే సెక్రటేరియట్‌లో చేయాల్సిన పనులన్నీ చేయనున్నట్లు చౌహాన్ తెలిపారు.
మండిపడ్డ విపక్షాలు
సీఎం చౌహాన్ దీక్ష నాటకమని కాంగ్రెస్ మండిపడింది. ‘అన్నదాతలను విస్మరించి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చిన సీఎం.. ఎవరికి వ్యతిరేకంగా దీక్ష చేయాలనుకుంటున్నారు?’ అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా విమర్శించారు. రైతుల మృతిపై ఇంతవరకు హత్యకేసు ఎందుకు నమోదు చేయలేదని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.
నిరవధిక నిరాహార దీక్ష చేసే బదులు మంద్‌సౌర్ వెళ్లి రైతులను పరామర్శించి వస్తే బాగుండేదని శివసేన విమర్శించింది. అనంతరం కొందరు శివసేన ప్రతినిధుల బృందం సీఎం చౌహాన్‌ను కలిసి సమస్య పరిష్కారానికి కొన్ని సూచనలు చేసింది. కాగా, రైతుల ఆందోళనకు కేంద్రమైన మంద్‌సౌర్‌లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. శనివారం కర్ఫ్యూను ఎత్తేసినట్లు ఎస్పీ ప్రకటించారు. పిపల్‌మండీలో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది.