
సీఎం పవర్‌ను పలుచన చేయం
టీఆర్‌ఎస్ ఎంపీలతో రాజ్‌నాథ్‌సింగ్
గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలపై చర్చ
రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు రానివ్వం
సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతాం
రాష్ర్ట అధికారాల్లో జోక్యం చేసుకోం
సమావేశం ఫలవంతమైందన్న టీఆర్‌ఎస్ ఎంపీలు
సర్క్యులర్ ఉపసంహరణ పై హామీ ఇవ్వని కేంద్ర హోంమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ అధికారాలను పలుచన చేసే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గురువారం ఇక్కడి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో టీఆర్‌ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాల విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బం దులు ఉండబోవని ఈ సందర్భంగా ఎంపీలకు రాజ్‌నాథ్ భరోసా ఇచ్చారు.
టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బీబీ పాటిల్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతల పేరుతో ముఖ్యమంత్రి అధికారాల్లోకి చొచ్చుకు వచ్చేలా అవకాశం కల్పించడంపై ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారమే ముందుకు వెళ్లాలని కోరారు.
పోలీస్ బదిలీల వరకూ గవర్నర్‌కు అధికారాలు కల్పించవద్దని కోరారు. స్టేషన్ హౌస్ అధికారి స్థాయి బదిలీకి కూడా గవర్నర్ ఆమోదం అవసరమని ఇటీవల కేంద్రం జారీ చేసిన సర్క్యూలర్‌ను ఎంపీలు తప్పుబట్టారు. దీనిపై హోంమంత్రి సర్ది చెప్పినట్టు సమాచారం. అయితే సర్క్యులర్ ఉపసంహరణకు నిరాకరించినట్టు సమాచారం. దీనివల్ల ముఖ్యమంత్రి అధికారాలకు ఎలాంటి ఢోకా ఉండదని అనునయించినట్టు తెలిసింది. దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను ఎప్పటికీ చేపట్టబోమని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశం అనంత రం బయటకు వచ్చిన హోంమంత్రి మీడియా తో ముచ్చటిస్తూ.. ‘ముఖ్యమంత్రి అధికారాల్లో మేం జోక్యం చేసుకోవడం లేదు. అలాంటి ఉద్దేశం మాకు లేదు. కేవలం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేస్తున్నాం.’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు కూడా మీడియాతో మాట్లాడారు. ‘హోంమంత్రితో సమావేశం ఫలవంతమైంది. గవర్నర్‌కు అధికారాలపై ఈ నెల 8న హోం శాఖ నుంచి వచ్చిన లేఖ వల్ల మాకు కొంత ఆవేదన కలిగింది. పార్లమెంటులో దాన్ని లేవనెత్తాం. రాజ్‌నాథ్‌తో భేటీ లో అన్ని విషయాలు వివరించాం. రాజ్యాంగం ప్రకారం కేంద్రం ఎంత మేరకు జోక్యం చేసుకోగలదో చెప్పాం. ఏ విషయంలోనూ ముఖ్యమంత్రి అధికారాలను పలుచన చేయబోమని హోంమంత్రి మాకు హామీ ఇచ్చారు.
సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగానికి లోబడే వ్యవహరిస్తామని భరోసా ఇచ్చారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు.’ అని కె.కేశవరావు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అధికారాలను ఎలా కలిగి ఉన్నారో.. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వాటినే కలిగి ఉంటారని రాజ్‌నాథ్ తమకు హామీ ఇచ్చినట్లు ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. అయితే హోంశాఖ సర్క్యులర్ ఉపసంహరణకు రాజ్‌నాథ్ హామీ ఇచ్చారా? అన్న ప్రశ్నకు సమాధానాన్ని టీఆర్‌ఎస్ ఎంపీలు దాట వేశారు.
ఉపసంహరించుకుంటుందని భావిస్తున్నాం: కవిత
హోం శాఖ సర్క్యులర్‌ను కేంద్రం ఉపసంహరించుకుంటుందనే భావిస్తున్నట్లు ఎంపీ కవిత చెప్పారు. ‘రోజువారీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఉండకూడదని మేం కోరాం. దానికి కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. సమాఖ్య స్వరూపాన్ని గౌరవిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అధికారాలకు భంగం ఉండదని చెప్పారు’ అని ఆమె పేర్కొన్నారు. ‘గవర్నర్ ఒక పెద్దమనిషి తరహాలో మార్గదర్శకత్వం వహిస్తే తప్పేం లేదు. అయితే రోజువారీ వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం నడుచుకుంటే ఫర్వాలేదు. ఈ విషయంపైనే రాజ్‌నాథ్‌తో చర్చించాం.’ అని కవిత తెలిపారు.