
రజనీకాంత్ లేట్‌గానైనా లేటెస్ట్‌గా వస్తారా?
‘నేను ఎప్పుడు, ఎలా వస్తానో ఎవరికి తెలియదు. కానీ సరైన సమయంలోనే వస్తాను’. ఇది 1995లో వచ్చిన ‘ముత్తు’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన పంచ్ డైలాగ్. రాజకీయాల్లోకి ఎప్పుడు.. ఎలా రావాలో అన్న ఆయన సందిగ్ధావస్థకు కూడా ఈ డైలాగే సమాధానం. ఆయన గత 21 ఏళ్లలో అనేకసార్లు తాను రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు వదిలారు. కానీ రాలేకపోయారు. ఆయన సంకేతాలు ఇచ్చినప్పుడల్లా మీడియా వాటికి విస్తృత ప్రచారాన్ని కల్పించడం, తమిళనాడు రాజకీయాలు కూడా కాస్త వేడెక్కడం, ఆ తర్వాత చప్పున చల్లారడం షరా మామూలుగా జరుగుతూ వచ్చింది.
చెన్నైలో గురువారం జరిగిన తన అభిమానుల సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ తాను రాజకీయల్లోకి వస్తానన్న సంకేతాలిచ్చారు. రాష్ట్ర రాజకీయాలు కుళ్లిపోతున్నాయని, వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఆ దేవుడు శాసిస్తే తాను రాజకీయల్లోకి వస్తానని చెప్పారు. ‘యుద్ధం కోసం నిరీక్షిస్తూ మీ విధులు మీరు నిర్వర్తిస్తూ వెళ్లండి’ అని కూడా అభిమానులకు పిలుపునిచ్చారు. అందులో యుద్ధమంటే ఎన్నికలని భావించవచ్చు. 67వ ఏట ఈసారి ఇచ్చిన ఈ సంకేతం నిజమయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితులే అందుకు కారణం. జయలలిత ప్రాతినిధ్యం వహించిన అన్నాడీఎంకే పార్టీలుగా, వర్గాలుగా చీలిపోవడమే అందుకు కారణం. డీఎంకే కురువృద్ధ నాయకుడు ఎం.కరుణానిధి కూడా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడం కూడా రజనీ సొంత పార్టీ ఏర్పాటుకు కలిసొచ్చే అవకాశం.
1995లోనే ఆ ఆలోచన వచ్చిందా?
నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉంటున్న ‘పోయెస్ గార్డెన్’ నివాసానికి సమీపంలోనే రజనీకాంత్ ఇల్లు ఉంది. ఓ రోజు జయలలిత వస్తున్నారని ఆ రోడ్డులో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దాదాపు గంటసేపు కారులోనే కూర్చుండిపోయిన రజనీకాంత్ చివరకు అసహనంతో కారు దిగి నడక ప్రారంభించారు. ఆయనకు మద్దతుగా అన్నట్లు ఎంతోమంది ప్రజలు కూడా ఆయన వెన్నంటి నడిచారు. అప్పుడే ఆయన కు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మొదటిసారి వచ్చిందేమో! ఆ తర్వాత కొన్ని నెలలకు ప్రముఖ దక్షిణాది దర్శకుడు మణిరత్నం ఇంటిపై దాడి జరిగింది (ఆయన బాంబే సినిమా విడులైన కొత్తలో). ఈ విషయమై రజనీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. దీనిపై మండిపడ్డ అన్నాడీఎంకే ఆయన్ని విమర్శస్తూ పోస్టర్లు వేసింది. ఈ నేపథ్యంలో 1996 ఎన్నికల్లో జయలలితను గెలిపిస్తే తమిళనాడును ఇక ఎవరూ రక్షించలేరని విమర్శించారు.
ప్రతిపక్షాన్ని ఏకం చేసిందీ ఆయనే
జయలలితను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో కరణానిధి నాయకత్వంలోని డీఎంకే, జీకే మూపనార్ నాయకత్వంలోని తమిళ్ మానిల కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదర్చడంలో రజనీకాంత్ కీలకపాత్ర పోషించారు. అప్పుడు డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. తాను పోటీచేసిన బర్గూర్ నియోజకవర్గంలో కూడా జయలలిత ఓడిపోయారు. అప్పటి డీఎంకే విజయానికి రజనీకాంత్ కారణమనే పేరు కూడా వచ్చింది. ఈ విషయాన్ని ఓసారి స్వయంగా రజనీకాంత్ కూడా చెప్పుకున్నారు.
1996లోనే సీఎం అయ్యే అవకాశం వచ్చింది
1996 ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చి జయలలితపై పోటీ చేయాలని రజనీకాంత్‌ను టీఎంసీ నాయకుడు మూపనార్ కోరారట. ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పారట. ఈ విషయాన్ని రజనీకాంత్ గానీ, మూపనార్ గానీ బయటకు చెప్పలేదు. 1996లోనే ముఖ్యమంత్రి అయ్యే గొప్ప అవకాశాన్ని రజనీకాంత్ వదులుకున్నారని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం ఓ మీడియా ఈవెంట్‌లో వ్యాఖ్యానించారు. అప్పట్లో మూపనార్‌కు చిదంబరం అత్యంత సన్నిహితుడు కనుక ఆయనకు మూపనార్ ఆఫర్ గురించి తెలిసే ఉంటుంది.
రాజకీయ నేతలపై తరచూ విమర్శలు
1996 ఎన్నికల తర్వాత నుంచి రజనీకాంత్ తరచు రాజకీయాల గురించి మాట్లాడేవారు. రాజకీయ నేతలను విమర్శించేవారు. సినిమాల్లో రజనీకాంత్ ఎక్కువగా సిగరెట్లను తాగడాన్ని విమర్శించినందుకు పట్టల్ మక్కల్ కచ్చి నాయకుడు ఎస్ రామదాస్‌పై 2004లో రజనీ మండిపడ్డారు. పీఎంకేకు వ్యతిరేకంగా తన అభిమానులతోని ప్రచారం చేయిస్తానని కూడా ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లోకి రానంటూ ఆయన ఎప్పుడూ చెప్పలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ కూడా ఆయన్ని కలుసుకున్నప్పుడు కూడా రజనీ త్వరలోనే రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రజనీ మద్దతిచ్చారంటూ ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేసుకున్నాయి. ఆ తర్వాత అలాంటిదేమీ లేదని రజనీ ఖండించారు.
సినిమా ప్రమోషన్ల కోసమేనా?
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటూ సంకేతాలివ్వడం, రాకపోవడం ఆయన సినిమాల ప్రమోషన్ల కోసమేనన్న విమర్శలు రజనీ కాంత్‌పైనా ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఆయన సినిమా విడుదలవడానికి ముందు సంకేతాలివ్వడం, సినిమా విడుదలయ్యాక రాజకీయాల ఊసెత్తకపోవడమే. రజనీకాంత్‌కు రాజకీయ, సామాజిక అంశాలపై కూడా నిశ్చితాభిప్రాయాలు లేవు. 1996లో ప్రతిపక్షాలను గెలిపించినదీ తానేనన్న ఆయన ఆ తర్వాత అదొక రాజకీయ యాక్సిడెంట్ అని వ్యాఖ్యానించారు. 2009లో శ్రీలంకలోని ‘ముళ్లైవైకల్’ ఊచకోత సంఘటనపై కూడా ఆయన నోరు విప్పకపోవడాన్ని తమిళ ప్రజలు తీవ్రంగా విమర్శించారు. కమల్ హాసన్ లాంటి వారు ఆ ఊచకోతను తీవ్రంగా ఖండించారు. కావేరీ జలాలపై కూడా ఆయనకు నిశ్చితాభిప్రాయం లేదు. కానీ తమిళ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఒక రోజు దీక్ష చేశారు. ఎంతైనా మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో పెరిగినవాడు కదా!
లేటెస్ట్‌గా వస్తారా....
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలకు రజనీకాంత్ లాంటి ఫ్యాన్‌ఫేర్ కలిగిన నాయకుడు కావాలి. జయలలిత మహాభినిష్క్రమణ, కరుణానిధి తప్పుకోవడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అసలు వారిద్దరితోనే రాజకీయాల్లో సినిమా తారల తరానికి తెరపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. రజనీ రాకతో ఆ సంప్రదాయం అలాగే కొనసాగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక భావాలు కలిగినందున రజనీ బీజేపీలో చేరుతారనే ప్రచారమూ ఉంది. తమిళ రాజకీయాల్లో రాణించాలంటే సొంత పార్టీని పెట్టుకోవడమే ఉత్తమమైన మార్గం. ఆ తాను ముక్కలాగా బీజేపీకి అంటకాగుతూ తోకపార్టీలాగా ఇంట గెలవచ్చు. ‘లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తారు’ అన్నది రజనీ అభిమానుల నమ్మకం.