
రజనీకాంత్ మరో అడుగు
చెన్నై: రాజకీయ ప్రవేశం కోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది చివరిలో ఆయన రాజకీయాల్లో కి రావడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా రజనీ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన రైతులతో భేటీ అయ్యారు. ఆదివారం అన్నదాతలను కలిశారు. కోటి రూపాయల సహాయం అందిస్తానని వారికి హామీయిచ్చారు.
ఇటీవల అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకునే సన్నాహాల్లో భాగంగానే రజనీకాంత్ ఇవన్ని చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన సన్నిహిత మిత్రుడు చేసిన ప్రకటనతో రజనీ రాజకీయ ప్రవేశం ఖాయమన్న ప్రచారం పతాకస్థాయికి చేరింది.
రజనీకాంత్ తన జన్మదినమైన డిసెంబర్ 12వ తేదీన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని ఆయన స్నేహితుడొకరు వెల్లడించారు. రాజకీయాల్లోకి రావాలని రజనీ నిర్ణయించుకున్నారని, అభిమానులతో మరోసారి సమావేశమైన తరువాత డిసెంబర్ 12వ తేదీన బ్రహ్మాండమైన బహిరంగ సభను ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన మీడియాకు తెలిపారు.