ఫ్లై ఓవర్ నుంచి పడిపోతున్న యువతి
సాక్షి, న్యూఢిల్లీ: మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తూ మరో వాహనం ఢీకొనడంతో ఫ్లై ఓవర్ మీద నుంచి కిందపడిన ఓ యువతి ఆశ్చర్యకరంగా ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన వికాస్‌పురి ఫ్లై ఓవర్‌పై సోమవారం మధ్యాహ్నం జరిగింది. పశ్చిమ ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ్ ఈ ఘటనను ధ్రువీకరించారు. యువతి పేరు సప్న(20) అని ఆమెకు స్వల్పంగా ఫ్రాక్చర్ అయిందని, ప్రమాదమేమీ లేదని తెలిపారు. వికాస్‌పురి పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కునాల్, జియా అనే మరో ఇద్దరు మిత్రులతో కలిసి సప్న మోటారుసైకిల్‌పై పశ్చిమ్ విహార్ నుంచి జనక్‌పురికి మరో మిత్రున్ని కలవడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కునాల్ మోటారు సైకిల్ నడుపుతుండగా, జియో మధ్యలో, సప్న వెనుక కూర్చున్నారని డీసీపీ చెప్పారు. మోటారుసైకిల్ వికాస్‌పురి ఫ్లై ఓవర్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో మోటారు సైకిల్ వారిని తాకుతూ వేగంగా వెళ్లిపోయింది. తాకిడి బలంగా ఉండడంతో కునాల్, జియో ఎగిరి ఫ్లైవర్ బారియర్‌పై పడ్డారు. సప్న గాలిలోకి ఎగిరి ఫ్లైఓవర్ మీద నుంచి కిందపడిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.
ఫ్లై ఓవర్ కింద ఉన్న సీసీటీవీ కిమెరాలో సప్న కిందపడే దృశ్యం మధ్యాహ్నం 1.56 గంటలకు రికార్డయింది. మొదట హెల్మెట్, ఆ తరువాత సప్న కిందపడడం వీడియోలో కనబడింది. సప్న కిందపడిన చోటుకు వెంట్రుకవాసి దూరంలో సెడాన్ పార్క్ చేసి ఉంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో మరే ఇతర వాహనం అటువైపు రాకపోవడం వల్ల సప్నకు అపాయం తప్పింది. కిందపడి స్పృహ తప్పిన సప్నను దారిన పోయేవారు ఆసుపత్రికి తరలించారు. ఆమె మిత్రులకు కూడా గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. సప్నకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయని, ఫ్రాక్చర్ అయిందని డాక్టర్లు తేల్చారు. ఆమె వికాస్‌పురి దగ్గర ఉన్న బుధేలా గ్రామవాసి అని, గ్రాడ్యుయేషన్ చేస్తోందని పోలీసులు తెలిపారు. వాహనాన్ని తాకిస్తూ వెళ్లిన వారిపై వికాస్‌పురి పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment