రేప్ చేసి.. ముక్కలుగా నరికి..
హరియాణాలో మరో నిర్భయ ఘటన
సోనిపట్: యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ‘నిర్భయ’ను మించిన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ (23)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమెను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికివేశారు. హరియాణాలోని రోహ్‌తక్‌లో జరిగిన ఈ పాశవిక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత 9వ తేదీన సోనిపట్‌లో మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు.. రోహ్‌తక్‌కు కారులో తరలించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు సోనిపట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
11వ తేదీన రోహ్‌తక్‌లో మృతదేహాన్ని గుర్తించామని, బాధిత మహిళ ముఖంపైన, పలుచోట్ల కుక్కలు కరిచినట్లు పేర్కొన్నారు. ‘ఆ మహిళపై తొలుత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఇటుకతో తీవ్రంగా కొట్టారు. ఆమె ముఖాన్ని బండరాయికేసి కొట్టారు. తలకు తీవ్రగాయాలవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది’ అని ఎస్సై అజయ్ మలిక్ వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులు సుమీత్, వికాస్‌లను అరెస్టు చేసినట్లు మలిక్ తెలిపారు.
కోర్టులో హాజరుపరచిన అనంతరం ఇద్దరినీ రెండు రోజుల కస్టడీకి తరలించారు. బాధితురాలికి సుమిత్ పరిచయస్తుడేనని పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బాధిత మహిళను కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించారు. హరియాణాలోని రోహ్‌తక్‌లో జరిగిన ‘హత్యాచార’ ఘటనపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోనిపట్‌లో మహిళను అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పదించారు. దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. మరో మూడు నెలల్లో హరియాణ వాసుల డేటాబేస్ పూర్తవుతుందని వెల్లడించారు.