తిరగబడ్డ యువతులకు సన్మానం
- రోహ్‌తక్ అక్క చెల్లెళ్లను గౌరవించనున్న హర్యానా సర్కారు
చండీగఢ్: బస్సులో వేధింపులకు దిగిన ఆకతాయిల భరతం పట్టిన ఇద్దరు రోహ్‌తక్ అక్కచెల్లెళ్లను గణతంత్ర దినోత్సవ సందర్భంగా సన్మానించాలని హరియానా ప్రభుత్వం నిర్ణయిం చింది. వీరికి నగదు బహుమతి అందచేయనున్నట్లు హరియానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటించారు.
ఇటీవల హరియానాలో కళాశాలకు వెళుతున్న యువతుల పట్ల ముగ్గురు పోకిరీలు అసభ్య చేష్టలకు దిగటంతో తీవ్రంగా ప్రతిఘటించి బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో మిగతా ప్రయాణికులు చేష్టలుడిగి చూస్తున్నా బాధితుల్లో ఓ యువతి బెల్టుతో నిందితులపై తిరగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, కండక్టర్‌ను హరియానా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు కుల్‌దీప్, మోహిత్, దీపక్‌లను డిసెంబర్ 6 వరకు రిమాండ్‌కు తరలించారు.
యువతులకు కేంద్ర మంత్రుల ప్రశంసలు
యువతులంతా రోహ్‌తక్ అక్కచెల్లెళ్లను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రి ఉమా భారతి సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు అన్ని రకాలుగా ముప్పు ఉందని ఈ సంఘటనతో తేలిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా, కన్ల్సాకి చెందిన ముగ్గురు నిందితులను 24 గంటల్లోగా విడుదల చేయాలని గ్రామస్తులు హెచ్చరించా రు. తమ గ్రామ యువకులపై తప్పుడు కేసులో బనాయించారని ఆరోపించారు. ఇది వేధింపుల కేసు కాదని, సీట్ల గురించి వివాదమన్నారు.