భర్తను చంపి నగలు, నగదుతో పరార్
ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో దారుణం జరిగింది. భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి గొంతు పిసికి హత్య చేసిందో భార్య. అనంతరం లక్షల విలువ చేసే నగలు, డబ్బుతో ఉడాయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు చెందిన తారగా గుర్తించారు. మృతుడి కొడుకు భరత్ సింగ్ (14) ఇచ్చిన సమాచారంతో ఈ అమానుషం వెలుగు చూసింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిర్మల్ సింగ్ (45) ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు భరత్ వికలాంగుడని సమాచారం. అయితే మొదటి భార్యకు విడాకులిచ్చిన నిర్మల్ సింగ్ నాలుగేళ్ల క్రితం తారను రెండో వివాహం చేసుకున్నాడు. ఏమైందో ఏమో తెలియదుగానీ, సోమవారం రాత్రి సింగ్, ఆయన కుమారుడికి పథకం ప్రకారం నిద్రమాత్రలిచ్చింది. ఆ తర్వాత భర్తను గొంతునులిమి హత్యచేసి డబ్బు, నగలతో అక్కడినుంచి పరారయ్యింది. మంగళవారం మధ్యాహ్నానికి స్పృహలోకి వచ్చిన భరత్.. చుట్టుపక్కలవారికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే హత్య చేసిన అనంతరం తార.. భరత్ మొబైల్‌ఫోన్ ను కూడా తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితురాలి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.