న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లేందుకు వీలుగా ఓ మహిళ భర్తతో విడాకులు కోరింది. పాస్‌పోర్టులో వైవాహిక స్థితిలో ఒంటరి అని పేర్కొనేందుకే ఈ భర్త నుంచి విడాకులు ఇప్పించమని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతకుముందుగా భర్త క్రూరుడని, తనను వదిలేసి ఉంటున్నాడన్న కారణంగా విడాకులు కోరిన ఈ అతివ ఆ తరువాత అసలు విషయం కోర్టుకు తెలిపింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన అదనపు జిల్లా జడ్జి సుజాత కోహ్లీ ‘‘హిందూ వైవాహిక చట్టం ప్రకారం ఇలాంటి స్వల్ప కారణాలతో విడాకులు మంజూరు చేయడం వీలు కాదు. మొదట భర్త తనతో ఎనిమిది సంవత్సరాలుగా విడిచి వెళ్లిపోయాడని పేర్కొన్న పిటిషనర్ తరువాత కేవలం పాస్‌పోర్టులో ఒంటరి అని పేర్కొనడానికే విడాకులు కోరుతున్నట్లు కోర్టుకు తెలిపింది.
విడాకులు కోరిన పిటిషన్ మీద భర్త చిరునామాను పేర్కొంది. కుమారుడితో కలిసి ఉండడానికి తాను విదేశాలకు వెళ్లదల్చుకున్నట్లు పేర్కొంది. ఇలాంటి అహేతుక కారణాలను కోర్టు పరిగణనలోకి తీసుకోజాలదు’’ అని కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.