మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్ధతుగా ధర్నాకు దిగిన మహిళలు(పాత చిత్రం)
దేశ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు మరోసారి చర్చనీయాంశమైంది. బుధవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం పురుషులకే పరిమితమైందా ? ముస్లిం మహిళలు ఎదుర్కుంటున్న ట్రిపుల్ తలాఖ్ సమస్యపై ఆ పార్టీ వైఖరేమిటంటూ ఉత్తరప్రదేశ్‌లో గత శనివారం ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమది ముస్లింల పార్టీ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పిన వార్త పత్రికల్లో చూశానని, అయితే ఆయన పార్టీ ముస్లిం పురుషుల కోసమేనా లేక మహిళల కోసం కూడానా అని ప్రశ్నిస్తున్నామన్నారు.
విపక్షాలు పార్లమెంట్ సమావేశాలు స్తంభింపచేస్తూ, ట్రిపుల్ తలాఖ్ వంటి ముఖ్యమైన చట్టాలకు అడ్డుపడుతున్నాయంటూ మోదీ మండిపడ్డారు. ఈ విమర్శలపై స్పందిస్తూ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బేషరతు మద్దతునిస్తున్నట్టు సోమవారం ప్రధానికి ఓ లేఖ రూపంలో రాహుల్‌గాంధీ సవాల్ విసిరారు. పార్టీలకు అతీతంగా మోదీ వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించాలని, అందుకు తమ పార్టీ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2010లోనే రాజ్యసభ ఆమోదం పొందినా, ఇంకా లోక్‌సభ ఆమోదం పొందాల్సి ఉంది. 1974లోనే ఈ అంశంపై తొలిసారిగా చర్చ ఫలితంగా ఓ నివేదికను సమర్పించారు. 1993లో 73, 74 రాజ్యాంగ సవరణల రూపంలో పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాలకు పైగా ఈ బిల్లు పయనం సాగిందిలా...
-- చట్టసభల్లో మహిళలకు మరింత మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌పై దేశవ్యాప్తంగా చర్చ నేపథ్యంలో 1996లో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ల బిల్లు తెరపైకి వచ్చింది.
– దేవెగౌడ ప్రభుత్వహయాంలో 1996 సెప్టెంబర్ 12న మొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
– కొన్ని అభ్యంతరాల నేపథ్యంలో ఈ బిల్లుపై (81వ రాజ్యాంగ సవరణ రూపంలో) గీతా ముఖర్జీ అధ్యక్షతన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుచేశారు. 11వ లోక్‌సభలో భాగంగా 1996 డిసెంబర్ 9న జేపీసీ నివేదిక సమర్పించింది.
–1998 జూన్ 26న (12వ లోక్‌సభలో) ఈ బిల్లును 84వ రాజ్యాంగ సవరణ బిల్లుగా వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టింది.
–13వ లోక్‌సభలో భాగంగా 1999 నవంబర్ 22న మరోసారి ప్రవేశపెట్టారు. ఈ బిల్లును చేపడితే మద్దతునిస్తామంటూ కాంగ్రెస్, వామపక్షాలు లిఖితపూర్వకంగా హామీనిచ్చా,యి.
– మళ్లీ 2002లో ఒకసారి, 2003లో రెండు పర్యాయాలు సభ సమక్షానికి తీసుకొచ్చినా ఆమోదం పొందలేకపోయింది.
– 2004 మేలో యూపీఏ హయాంలో కనీస ఉమ్మడి కార్యక్రమంలో ఈ బిల్లుకు చోటు లభించింది. అయితే ఆ ప్రభుత్వం కూడా ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టలేకపోయింది.
– 2008 మే 6న ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాక, దీనిని స్థాయిసంఘానికి నివేదించారు.
– 2009 డిసెంబర్ 17న స్థాయి సంఘం నివేదిక సమర్పణ అనంతరం ఉభయసభల్లో బిల్లు ప్రవేశపెట్టాక సమాజ్‌వాదీ, జేడీయూ, ఆర్జేడీ పార్టీలు నిరసనలు తెలియజేశాయి.
– 2010 ఫిబ్రవరి 25న మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
– 2010 మార్చి 8న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టినా నిరసల నేపథ్యంలో ఓటింగ్ వాయిదా వేశారు. యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలుగుతామంటూ ఎస్‌పీ, ఆర్జేడి హెచ్చరించాయి.
– 2010 మార్చి 9న పూర్తి మెజారిటీతో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది.
Comments
Please login to add a commentAdd a comment