![అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41437725125_625x300.jpg.webp?itok=ATvKrYaO)
అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం కాబట్టే యాకుబ్ ను ఉరి తీస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. కేవలం ముస్లిం అయినందు వల్లే యాకుబ్ మెమన్ ఉరిశిక్ష విధించారన్నారు. అతని పిటిషన్ పరిశీలించకుండా, అసలు యాకూబ్ ను ఎలా ఉరి తీస్తారని ఒవైసీ నిలదీశారు.
రాజీవ్ గాంధీ, బియాంత్ సింగ్ హంతకులకు తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో రాజకీయ నేతల అండ ఉందన్నారు. అందుకే వారు యావజ్జీవ శిక్షలతో బతికిపోయారని, కానీ ముస్లిం మతస్థుడైన యాకూబ్ను ఆదుకునేవారే కరువయ్యారన్నారు. ఒక వేళ నేరస్తులను ఉరి తీయాలనుకుంటే, మతాన్ని ఆధారంగా చేసుకుని వారికి మరణ శిక్షలు విధించొద్దని ఆయన కోరారు. ఒక మతాన్ని టార్గెట్ చేయడం సమంజసం కాదన్నారు.
కాగా 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి అయిన యాకుబ్ మెమన్కు టాడా కోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా మెమన్ క్షమాభిక్ష పిటీషన్ను తిరస్కరించారు. ఇటీవల శిక్షనుతగ్గించాల్సిందా యెమెన్ పెట్టుకున్న పిటిషన్ కూడా సుప్రీం తిరస్కరించడంతో ఈ నెల 30న నాగపూర్ జైల్లో అతణ్ని ఉరి తీసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. . ఈ సమయంలో ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.